నేడు లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల కేటాయింపు

ABN , First Publish Date - 2020-11-20T05:17:40+05:30 IST

శ్రీకాళహస్తిలో ‘అందరికీ ఇళ్లు’ పథకం కింద పక్కా గృహాల పంపిణీ

నేడు లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల కేటాయింపు
శ్రీకాళహస్తిలో టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లు

శ్రీకాళహస్తి, నవంబరు 19: శ్రీకాళహస్తి పట్టణ శివారు రాజీవ్‌నగర్‌ వద్ద ‘అందరికీ ఇళ్లు’ పథకం కింద ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన పక్కా గృహాలకు మోక్షం కలుగుతోంది. టీడీపీ, వామపక్ష పార్టీల పోరాటాలు... ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండటంతో అధికార పార్టీలో కదలిక వచ్చింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లను ఎమ్మెల్యే బియ్యపు మధుసూదనరెడ్డి చేతుల మీదుగా శుక్రవారం లబ్ధిదారులకు కేటాయించాలని ముహూర్తం ఖరారు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో అందరికీ ఇళ్లు పథకం కింద 2017లో 6,015 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. 300 చదరపు అడుగుల ఇంటికి రూ.500, 365 చదరపు అడుగుల ఇంటికి రూ.50వేలు, 430 చదరపు అడుగుల ఇంటికి రూ.లక్ష వంతున లబ్ధిదారులు డీడీల రూపంలో డబ్బు చెల్లించారు. ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో మొదటి విడతలో 2,916 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రెండవ విడతలో 3,099 ఇళ్లు నిర్మాణం చేపట్టగా కొన్ని పూర్తయ్యాయి. మరికొన్ని ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మొదటి, రెండు విడతలకు సంబంధించి టీడీపీ హయాంలోనే 4,592 మందికి లాటరీ విధానంలో ఇళ్లు కేటాయించారు. మౌలిక వసతులు కల్పించిన తరువాత ఇళ్లలో చేరాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ లోగా ఎన్నికలు జరగడం... ప్రభుత్వం మారడంతో టిడ్కో గృహాల కథ మొదటికి వచ్చింది. రివర్స్‌ టెండరు పేరుతో ఇళ్ల నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదన్నర అవుతున్నా... ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించకపోవడంతో టీడీపీ, వామపక్షాలు ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇళ్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించింది. ఎట్టకేలకు ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం అంగీకరించడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే ఇంతకు మునుపు కేటాయించిన ఇళ్లనే ఇస్తారా...? లేక కొత్తగా మళ్లీ కేటాయిస్తారా అనేది తేలాల్సి ఉంది. కాగా, ఇళ్ల పంపిణీకి ఆగమేఘాలపై ముహూర్తం ఖరారు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2020-11-20T05:17:40+05:30 IST