మర్దాం పంటగా వరిసాగు!

ABN , First Publish Date - 2020-03-04T09:10:28+05:30 IST

మామూలుగా చెరకుపంటలో మర్దాం సాగును చేపట్టడం విన్నాం. కానీ వరిపంటలో కూడా మర్దాం సాగును చేశారు.

మర్దాం పంటగా వరిసాగు!

 ‘ప్రద్యుమ్న’ రకంతో ప్రస్తుతం రెండో ప్రయత్నం

తొలిసారి 89 సెంట్ల సాగులో 35 బస్తాల దిగుబడి

రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి ప్రయోగం సక్సెస్‌


చిత్తూరు (వ్యవసాయం), మార్చి 3: మామూలుగా చెరకుపంటలో మర్దాం సాగును చేపట్టడం విన్నాం. కానీ వరిపంటలో కూడా మర్దాం సాగును చేశారు. ఔను మీరు చదువుతోంది నిజమే. ఈ ప్రయత్నం జిల్లాకేకాదు రాష్ట్రంలోనే ఆదర్శమని చెప్పొచ్చు. రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగి చెంగల్రావు ఈ ప్రయోగంలో సక్సెస్‌ సాధించారు. తొలి ప్రయత్నంలోనే తనకున్న 89 సెంట్లలో ‘ప్రద్యుమ్న’ అనే వరి రకాన్ని సాగుచేసి 35 బస్తాల అధిక దిగుబడి సాధించాడు. ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయశాఖ ప్రతి మంగళవారం నిర్వహించే  ఫోన్‌ఇన్‌లైవ్‌ ద్వారా తనకు తానుగా తెలియజేయడంతో వెలుగులోకి వచ్చింది. వివరాలను విన్న వ్యవసాయశాఖ అధికారులే విస్తుపోయారు. వివరాలిలా ఉన్నాయి. 


పులిచెర్ల మండలం 106 రామిరెడ్డిగారిపల్లెకు చెందిన చెంగల్రావు పశుసంవర్ధకశాఖలో  బంగారుపాళెం మండలం సంక్రాంతిపల్లెలో సీనియర్‌ వెటర్నరీ ఆఫీసరుగా పనిచేస్తూ 2004లో ఉద్యోగ విరమణ చేశారు. అనంతరం తనకున్న 18 ఎకరాల పొలంలో 16 ఎకరాల్లో మామిడి, 1.50 ఎకరాల్లో వరితోపాటు కూరగాయల పంటలను ప్రకృతి వ్యవసాయం కింద సాగుచేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్వహించే ప్రతి రైతు సదస్సుకూ తప్పనిసరిగా హాజరవుతూ వారిచ్చే సూచనలను తూచా తప్పకుండా ఆచరిస్తుంటారు. ఈ క్రమంలో సాగులో ఏదైనా కొత్త ఒరవడి సృష్టించాలన్న తపన మొదలైంది. చెరకులో చేపట్టే మర్దాం సాగును వరిలోనూ చేయాలన్న ఆలోచన వచ్చింది. దాంతో తొలి ప్రయత్నంగా గత ఏడాది ‘ప్రద్యుమ్న’ అనే వరి రకాన్ని సాగు చేశారు. వరి కోత కోశాక పొలంలో రాలిపోయే విత్తనాలతోపాటు మొదళ్లనుంచి వచ్చే మొలకలకు కలిపి పొలం బీడు పోకుండా అవసరమైన మేరకు వరి విత్తనాలను చల్లి ఆరుతడి కింద నీరు పారించారు. దాంతో మొత్తం ఒకేసారిగా మొలకలొచ్చాయి.


కలుపు తీస్తూ అవసరాన్నిబట్టి మొలకలకు మధ్య దూరం కోసం మిగిలిన మొలకలను తొలగించి నీరు పారించారు. ఈ విధంగా తొలిప్రయత్నంలోనే 89 సెంట్ల పొలంలో 35 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. మంచి ఫలితాలే రావడంతో రెండో ప్రయత్నంగా కూడా మర్దాం సాగును చేపట్టారు. ప్రస్తుతం ఈ పంట కలుపు దశలో వుంది.  


ట్రయల్‌ బేస్‌లో సక్సెస్‌ అయ్యా.. చెంగల్రావు, రైతు, 106 రామిరెడ్డిగారిపల్లె, పులిచెర్ల మండలం

చెరకుతోపాటు ఇతర పంటల్లోనూ మర్దాంగా సాగు చేస్తున్నపుడు వరిలోనూ ఎందుకు సాగుచేయకూడదన్న ఆలోచన వచ్చింది. దాంతో ట్రయల్‌ బేస్‌లో తొలిప్రయత్నంగా 89 సెంట్లలో సాగును చేపట్టి 35 బస్తాల దిగుబడి సాధించా. ప్రస్తుతం రెండో ప్రయత్నంగా సాగు చేస్తున్నాం. నేను 16 ఏళ్లుగా ప్రతిపంటనూ ప్రకృతి వ్యవసాయం కింద  సాగుచేస్తున్నా. నేను సాగుచేసిన వరి విత్తనాలను స్థానికంగా అవసరమైన రైతులకూ ఇస్తున్నా. మంచి దిగుబడులే వస్తున్నాయి. వారంతా మామూలుగా సాగుచేస్తుంటే.. నేను మాత్రం ఆరుతడి పంటగా వరిని సాగుచేస్తున్నా. 


Updated Date - 2020-03-04T09:10:28+05:30 IST