ముగ్గురు ‘ఎర్ర’స్మగ్లర్ల అరెస్టు
ABN , First Publish Date - 2020-12-13T06:41:03+05:30 IST
ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అటవీశాఖ యాంటీ పోచింగ్ స్క్వాడ్ అధికారులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.

8 దుంగలు, మూడు వాహనాల స్వాధీనం
తిరుపతి(అటవీశాఖ), డిసెంబరు 12: ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అటవీశాఖ యాంటీ పోచింగ్ స్క్వాడ్ అధికారులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. ఎఫ్‌ఆర్‌వో దొరస్వామి తెలిపిన వివరాల మేరకు.. శేషాచల అడవుల నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారని తిరుపతి వైల్డ్‌లైఫ్ ఇన్‌చార్జ్ డీఎఫ్‌వో హిమశైలజకు రహస్య సమాచారం అందడంతో శ్రీనివాసమంగాపురం సమీపంలోని లక్ష్మీచెరువు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. అప్పటికే ఆ ప్రాంతంలో ఓ కారులో ఎనిమిది ఎర్రచందనం దుంగలను తరలించడానికి సిద్ధంగా ఉంచారు. అటవీ సిబ్బందిని చూసిన స్మగ్లర్లు పరారవడానికి ప్రయత్నించగా.. వెంటాడి ఎంఆర్‌పల్లె వద్ద వారిని పట్టుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి ఎనిమిది దుంగలతోపాటు కారు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన స్మగ్లర్లు తిరుపతికి చెందిన వరప్రసాద్(లింగేశ్వరనగర్), పి.మహేష్‌బాబు (మాధవనగర్), శ్రీనివాసరావు (నెహ్రూనగర్)గా గుర్తించారు. వీరిని శనివారం కోర్టులో హాజరుపరచగా ఈనెల 23వతేదీవరకు రిమాండ్ విధించారు. ఈ దాడుల్లో డీఆర్‌వో జి.విజయ్‌కుమార్, ఎఫ్‌బీవో జాన్ షామీర్, సిబ్బంది చిరంజీవి, రఘు, రాజేష్, సునీల్, మోహన్ పాల్గొన్నారు.