మరో మూడు కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-08T09:04:55+05:30 IST

జిల్లాలో గురువారం కొత్తగా మూడు కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ల

మరో మూడు కరోనా కేసులు

స్విమ్స్‌లో ఇంకో ఉద్యోగినికి పాజిటివ్‌ 

కోయంబేడు లింకుతో గుడిపాలవాసికి

చెన్నై లింకుతో మదనపల్లె యువకుడికి

జిల్లాలో మొత్తం 85కు పెరిగిన కేసులు


తిరుపతి, మే 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం కొత్తగా మూడు కరోనా  కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ల సంఖ్య 85కు పెరిగింది. వీరిలో 71 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచీ డిశ్చార్జి కాగా తాజా కేసులు మూడింటితో కలిపి 14 మంది చికిత్స పొందుతున్నారు.


ఐదు రోజుల్లోనే స్విమ్స్‌లో ఇద్దరికి  

తిరుపతి స్విమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో గడచిన ఐదు రోజుల్లోనే ఇద్దరికి కరోనా వైరస్‌ సోకింది. ఈ నెల 2వ తేదీన ఓ స్టాఫ్‌ నర్సుకు వైరస్‌ సోకినట్టు అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. కరోనా రోగులకు ఎలాంటి చికిత్సలు, టెస్టులు నిర్వహించని స్విమ్స్‌ ఆసుత్రిలో ఉద్యోగికి వైరస్‌ ఎలా సోకిందో అర్థం కాక ఆసుపత్రి వర్గాలు అయోమయానికి గురయ్యాయి. మూలాలు తెలియకపోవడంతో ఎందుకైనా మంచిదని ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఆసుపత్రిలో పనిచేసే 700 మంది ఉద్యోగులు, అధికారుల నుంచీ శాంపిల్స్‌ సేకరించారు. వాటిని ల్యాబ్‌కు పంపగా విడతల వారీ ఫలితాలు వస్తున్నాయి. అందులో భాగంగానే గురువారం వచ్చిన కొందరి ఫలితాలలో న్యూరాలజీ వార్డులో పనిచేసే స్టాఫ్‌ నర్సుకు సోకినట్టు తేలింది. ఫలితాలు వచ్చేవరకూ అంటే గురువారం మధ్యాహ్నం వరకూ ఆమె న్యూరాలజీ వార్డులో విధులు నిర్వర్తించినట్టు సమాచారం. ఫలితాలు వచ్చాకే ఆమెను ఐసొలేషన్‌కు తరలించారు.


దీంతో అప్పటి దాకా ఆమెతో కలసి పనిచేసిన సిబ్బంది, అధికారులు, వార్డులోని రోగులు, వారి సహాయకులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఫలితంగా ఇదివరకూ సేకరించిన శాంపిల్స్‌ సంగతి పక్కనపెట్టి ఇపుడు సహచర ఉద్యోగులకు, వార్డులోని రోగులు, వారి సహాయకులకు కూడా టెస్టులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన మొత్తం స్విమ్స్‌ వైద్య వర్గాలనే కలవరపాటుకు గురి చేస్తోంది. నిజానికి స్విమ్స్‌ వర్గాలు ఉద్యోగులకు కరోనా టెస్టులు నిర్వహించే విషయంలో కాస్తంత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి వుండగా అలా చేయలేదు. స్విమ్స్‌లో పనిచేసే ఉద్యోగికి వైరస్‌ సోకి, దానికి మూలాలు తెలియనపుడు మొత్తం ఉద్యోగులకు కరోనా టెస్టులు జరపాలి. అయితే దీనికి టాప్‌ ప్రయారిటీ ఇచ్చి టెస్టులు నిర్వహించి వుంటే రోజుకు 4వ తేదీకే దాదాపు అందరి ఫలితాలూ వచ్చేసి వుండేవి. లేదంటే కనీసం ఫలితాలు వచ్చి అందులో నెగటివ్‌ అని తేలినవారినే విధులకు అనుమతిస్తూ వెళ్ళినా సరిపోయి వుండేది. ఫలితాలు పెండింగులో వుండగా వారిని విధులకు అనుమతిస్తే వైరస్‌ సోకిన వారి ద్వారా మరింత మంది సహచర ఉద్యోగులు ప్రమాదంలో పడే అవకాశాలున్నాయి. సరిగ్గా ఇపుడు జరిగిందిదే.


కోయంబేడు లింకుతో గుడిపాలవాసికి 

గుడిపాల మండలం మండికృష్ణాపురానికి చెందిన ఓ వ్యక్తి అదే మండలం మరకాలకుప్పం పంచాయతీ తిమ్మయ్యపల్లెలో పెళ్ళి చేసుకుని అక్కడే స్థిరపడిపోయాడు. చెన్నైలోని కోయంబేడు కూరగాయల మార్కెట్‌లో దినసరి కూలీగా పనిచేస్తూ వారానికి ఒక రోజు ఇంటికి వచ్చివెళ్ళేవాడు. ఆ క్రమంలో గత ఆదివారం తిమ్మయ్యపల్లెకు చేరుకోగా వార్డు వలంటీరు గుర్తించి కుటుంబీకులతో సహా గత సోమవారం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ ట్రూనాట్‌ మెషిన్‌తో టెస్టులు నిర్వహించగా కుటుంబీకులకు నెగటివ్‌ రాగా అతనికి మాత్రం పాజిటివ్‌ వచ్చింది. దీంతో పూర్తి నిర్ధారణ కోసం శాంపిల్స్‌ తిరుపతి స్విమ్స్‌ ల్యాబ్‌కు పంపిన ఆసుపత్రి వర్గాలు అతన్ని ఐసొలేషన్‌లో వుంచడం మరిచారు.


దాన్ని అవకాశంగా తీసుకున్న ఆ వ్యక్తి కుటుంబీకులను స్వగ్రామానికి పంపివేసి తాను ఆసుపత్రి ఆవరణ నుంచీ మాయమయ్యాడు. నగరంలోనే లాలూ గార్డెన్‌ ప్రాంతంలో వున్న తన సోదరుడి ఇంటిలో తలదాచుకున్నట్టు సమాచారం. సోమవారం సాయంత్రం నుంచీ బుధవారం రాత్రి 7 గంటల వరకూ అక్కడే గడిపాడు. తర్వాత మళ్ళీ ప్రభుత్వాసుపత్రికి వెళ్ళి వైద్యుల ముందు హాజరయ్యాడు. గురువారం ల్యాబ్‌ రిపోర్టులో పాజిటివ్‌ అని రావడంతో అతన్ని ఐసొలేషన్‌కు తరలించారు. కాగా గత సోమవారం ట్రూనాట్‌ మెషిన్‌లో పాజిటివ్‌ అని వచ్చినా ఆసుపత్రి వర్గాలు ముందు జాగ్రత్త తీసుకోకపోవడంతో అతడు రెండు రోజుల పాటు తన సోదరుడి ఇంట్లో గడిపాడు. తద్వారా ఆ కుటుంబాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టినట్టయింది. ఇపుడు అతడి కుటుంబీకులతో పాటు సోదరుడి కుటుంబీకులను కూడా క్వారంటైన్‌కు తరలించారు.


చెన్నై లింకుతో మదనపల్లె యువకుడికి 

మదనపల్లె మండలం దండువారిపల్లెకు చెందిన పాతికేళ్ళ యువకుడు చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌ అంతకంతకూ పొడిగిస్తూండడం, తమిళనాడు ప్రభుత్వం సరిహద్దులు మూసివేయడంతో స్వగ్రామం చేరుకోవడానికి ప్రత్యామ్నాయం అన్వేషించాడు. తన కంపెనీలోనే పనిచేస్తున్న పుంగనూరు మండలం ఒంటిల్లుకు చెందిన సహచరుడితో కలసి వేర్వేరు లారీల్లో ప్రయాణించి మంగళవారం సాయంత్రం పుంగనూరు చేరుకున్నాడు. అక్కడనుంచీ ఇద్దరూ తమతమ స్వగ్రామాలకు చేరుకున్నారు. బుధవారం మధ్యాహ్నం వీరిద్దరూ మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి వెళ్ళి ట్రూనాట్‌ టెస్టులు చేయించుకున్నారు. పుంగనూరు యువకుడికి నెగటివ్‌ రావడంతో అతన్ని హోమ్‌ క్వారంటైన్‌లో వుండమని సూచించి పంపివేశారు.


మదనపల్లె యువకుడికి పాజిటివ్‌ రావడంతో నిర్ధారణ కోసం శాంపిల్స్‌ స్విమ్స్‌ ల్యాబ్‌కు పంపించారు. అయితే మదనపల్లె ఆసుపత్రి వర్గాలు కూడా నిర్లక్ష్యం వహించడంతో దండువారిపల్లె యువకుడు ఆసుపత్రిలోని ఐసొలేషన్‌ వార్డుకు కాకుండా నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు. బుధవారం రాత్రి ఇంట్లోనే గడిపి గురువారం మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాడు. గురువారం ఫలితం వెలువడి పాజిటివ్‌ అని తేలింది.మంగళవారం సమీప బంధువొకరు మోటర్‌ సైకిల్‌లో స్వగ్రామానికి లిఫ్ట్‌ ఇచ్చినట్టు చెబుతున్నారు. మంగళవారం రాత్రి, బుధవారం రాత్రి ఈ యువకుడు ఇంట్లోనే వున్నాడని గ్రామస్తులే కొందరు చెబుతున్నారు. మంగళవారం రాత్రి సంగతి పక్కనపెడితే బుధవారం ట్రూనాట్‌ టెస్టులో పాజిటివ్‌ అని వచ్చాక కూడా అతన్ని ఆసుపత్రి వర్గాలు ఎలా స్వగ్రామానికి పంపించాయన్న ప్రశ్న తలెత్తుతోంది.


రెండు రోజులు ఇంట్లో వుండడం వల్ల కుటుంబ సభ్యులతో పాటు సన్నిహిత బంధువులు, మిత్రులు కూడా వైరస్‌ బారినపడేందుకు అవకాశమేర్పడింది. గుడిపాల, మదనపల్లె కరోనా రోగుల వ్యవహార శైలి వల్ల కాంటాక్టుల సంఖ్య పెరిగింది. కోయంబేడు లింకులతో జిల్లాకు ప్రమాదం పొంచివుందని ఇదివరకే ఆంధ్రజ్యోతి హెచ్చరించిన నేపధ్యంలో ఆ లింకులతో జిల్లాలో తొలికేసు గురువారం నమోదు కావడం గమనార్హం. కాగా జిల్లాలో ఇక కొత్త కేసులేవీ నమోదు కాలేదని రోజులు లెక్కిస్తున్న అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు కొత్త కేసులు సవాలు విసురుతూనే వున్నాయి.


పలమనేరు, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం తప్పితే 31 మండలాలున్న పశ్చిమ ప్రాంతంలో కరోనా బెడద లేదన్న నిశ్చింతకు గురువారం నాటి మదనపల్లె కరోనా కేసు బ్రేక్‌ వేసింది. పశ్చిమానికి కూడా ముప్పు వుందన్న హెచ్చరికలు జారీ చేసింది. అదే విధంగా చిత్తూరు ప్రాంతంలోనూ గుడిపాల ఘటన కరోనా ఏ వైపు నుంచైనా, ఏ మూలకైనా వ్యాప్తి చెందగలదని నిరూపిస్తోంది. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో జనజీవనం మళ్ళీ రోడ్డెక్కుతున్న తరుణంలో గురువారం నాటి మూడు కరోనా కేసులు ఓ విధంగా హెచ్చరికల్లాంటివేనని భావించాల్సి వస్తోంది.

Updated Date - 2020-05-08T09:04:55+05:30 IST