ఈసారి బ్రహ్మోత్సవాలు ఏకాంతమేనా!

ABN , First Publish Date - 2020-08-20T09:52:42+05:30 IST

మిరుమిట్లు గొలిపే వెలుగులు.. ఉదయం, సాయంత్రం వాహన సేవల కనువిందు.. వేలాది భక్తుల గోవింద నామస్మరణం. కళాకారుల సాంస్కృతిక కళా ప్రద

ఈసారి బ్రహ్మోత్సవాలు ఏకాంతమేనా!

 వచ్చేనెల 19 నుంచి వార్షిక, అక్టోబరు 16 నుంచి నవరాత్రి   బ్రహ్మోత్సవాలు 

 అధిక మాసంతో ఈ ఏడాది రెండు 


తిరుమల, ఆంధ్రజ్యోతి :

మిరుమిట్లు గొలిపే వెలుగులు.. ఉదయం, సాయంత్రం వాహన సేవల కనువిందు.. వేలాది భక్తుల గోవింద నామస్మరణం. కళాకారుల సాంస్కృతిక కళా ప్రదర్శనలు. మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చే ఉత్సవర్లు.. ఫల, పుష్ప ప్రదర్శనశాలలు. ఇవేవీ లేకుండానే ఈసారి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు కేవలం ఆలయానికే పరిమితం కానున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి.


అధికమాసంతో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించాల్సి ఉండగా.. వచ్చే నెలలో వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించేలా టీటీడీ అధికారులు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబరు 19 నుంచి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తొలిరోజున ధ్వజారోహణం, 23న గరుడవాహనం, 24న స్వర్ణరథోత్సవం, 26న రథోత్సవం, 27న చక్రస్నానం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. అలాగే అక్టోబరు 16 నుంచి 24వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 


సాధారణ రోజుల్లో బ్రహ్మోత్సవాలిలా.. 

సాధారణంగా బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిదిరోజుల్లో మొదటి మూడురోజుల్లో లక్షమంది చొప్పున గ్యాలరీల్లో కూర్చుని వాహన సేవలను వీక్షిస్తారు. ఐదో రోజున గరుడ సేవకు గ్యాలరీల్లో 2 లక్షలు, వెలుపల మరో యాభైవేల మంది వరకు ఉంటారు. తర్వాత మూడురోజులు రెండు నుంచి రెండున్నర లక్షల మంది ఉత్సవాల్లో పాల్గొని వాహనసేవలను తిలకిస్తారు. చివరిరోజు 60 వేల మంది మాత్రమే చక్రస్నానంలో పాల్గొంటారు.


ఇలా దాదాపు 10.10 లక్షల మంది బ్రహ్మోత్సవాల్లో పాల్గొని దర్శన భాగ్యాన్ని పొందుతారు. మరోవైపు అధికమాసంలో వచ్చే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. ఈ తొమ్మిదిరోజుల్లో 5 లక్షల నుంచి 6 లక్షల్లోపు భక్తులు పాల్గొంటారు. ఇక, వాహన సేవల్లో.. ప్రతి వాహనం ముందు 300 నుంచి 350 మంది కళాకారులు వివిధ ప్రదర్శనలతో భక్తులను ఆకట్టుకుంటారు. 


కొవిడ్‌తో ఆలయానికే పరిమితం!

కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో వచ్చేనెల్లో జరగాల్సిన వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయానికే పరిమితం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ మాడవీధుల్లో ఉత్సవాల నిర్వహణకు పూనుకుంటే భక్తులను అదుపుచేయడం అసాధ్యమని టీటీడీ బోర్డు, అధికారులు భావిస్తున్నారు. ఈ అంశంపై ఈ నెలాఖరులో జరగనున్న ధర్మకర్తల మండలి సమావేశంలో ఆగమపండితులు, అర్చకులతో చర్చించి తుది నిర్ణయం ప్రకటించనున్నారు.


మరోవైపు కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే అవకాశం, కేంద్రప్రభుత్వాలు ఇచ్చే నిబంధనలకు అనుగుణంగా అక్టోబరులో జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించి మాడవీధుల్లో నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. 


ఏకాంతంగా అంటే..

ఒకవేళ ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తే.. భక్తులెవరినీ అనుమతించరు. ఆలయంలోనే జరిగే ఉత్సవాల్లో అర్చకులు, జీయర్‌స్వాములు, అధికారులు పరిమిత సంఖ్యలో పాల్గొంటారు. ఇప్పటికే ప్రతినెలా నిర్వహించే పున్నమి గరుడసేవను పరిశీలిస్తే.. ఆలయంలోని గర్భాలయం నుంచి విశేషంగా అలంకరించిన మలయప్పస్వామిని వేంచేపుగా రంగనాయక మండపానికి తీసుకొస్తున్నారు.


అప్పటికే సిద్ధంగా ఉంచిన గరుడుడిపై కొలువుదీర్చి జీయర్‌స్వాముల ఆధ్వర్యంలో అర్చకులు హారతులు సమర్పిస్తారు. పూజా కార్యక్రమాలు ముగిశాక వేదమంత్రాలు పఠించి తిరిగి గర్భాలయానికి ఉత్సవర్లను వేంచేపు చేస్తారు.బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలంటే.. ఇలానే ఉదయం, రాత్రి ఆయా వాహనాలపై రంగనాయక మండపంలో ఉత్సవర్లను ఆశీనులు చేసి పూజలు నిర్వహిస్తారు. తిరుమల చరిత్రలో ఎన్నడూ ఇలా ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించిన సందర్భాలు లేవు.  

Updated Date - 2020-08-20T09:52:42+05:30 IST