వేదపరీక్షల్లో 270 మంది ఉత్తీర్ణత
ABN , First Publish Date - 2020-03-02T10:47:15+05:30 IST
తిరుమల ధర్మగిరి వేదవిజ్ఞానపీఠంలో నిర్వహించిన వేదపరీక్షల్లో 270మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

తిరుమలలో పూర్ణాహుతితో ముగిసిన వేదవిద్వత్ సదస్సు
తిరుమల, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): తిరుమల ధర్మగిరి వేదవిజ్ఞానపీఠంలో నిర్వహించిన వేదపరీక్షల్లో 270మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. తిరుమలలో గత 26న ప్రారంభమైన 28వ అఖిలభారత శ్రీ వేంకటేశ్వర వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు శనివారం ముగిసింది. దీనికి దేశవ్యాప్తంగా 727 మంది వేద విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 327 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 270మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులైన 178 మందికి 5గ్రాముల బంగారు డాలరు, నగదు బహుమానం, విజయపత్రిక, పండితశాలువాతో సత్కరించారు. ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన 92 మందిని 10గ్రాముల వెండిడాలరు, నగదు బహుమానం, విజయపత్రిక, పండితశాలువాతో సన్మానించారు. 104మంది పరీక్షాధికారులనూ ఘనంగా సత్కరించారు. ముగింపు సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన శృంగేరిపీఠం పాలనాధికారి గౌరిశంకర్ మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లో భిన్న సంస్కృతులున్నా, ధర్మం అనే ఒక భాష ద్వారా శతాబ్దాల నుంచి మనమంతా ఐక్యంగా ఉన్నామని తెలిపారు. ఒక వేదికపై 700మందికిపైగా ప్రముఖ పండితులతో సదస్సు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు.
తిరుమలలో వేదవిద్యన అభ్యిసిస్తున్న విద్యార్థులందరూ భావితరాలకు వేదజ్ఞానం అందించాలని ఆయన కోరారు. అనంతరం ప్రముఖ పండితుడు ఎం.నాగఫణిశర్మ నిర్వహించిన అవధాన ప్రక్రియ విద్యార్థులను ఆకట్టుకుంది. చివరగా ధర్మగిరి శ్రీ వేంకటేశ్వర వేదవిజ్ఞానపీఠం సంబంఽధించిన శృతివివేచని పుస్తకాన్ని బ్రహ్మశ్రీ మడుగుల నాగఫణిశర్మ, శృంగేరిపీఠం పాలనాధికారి గౌరీశంకర్ ఆవిష్కరించారు. ఇక, లోకకల్యాణార్థం ప్రతినిత్యం చతుర్వేదపారాయణం, రామగోపాల సోమయాజీ, కల్పకంబసోమస్తిని దంపతులచే 5రోజులుగా స్త్రోతయాగం నిర్వహించారు. ఆదివారం ఉదయం శ్రీవైష్ణవేష్టియాగం, ప్రముఖ చతుర్వేద పండితులు నిర్వహించిన పూర్ణాహుతితో వేద సదస్సు ముగిసింది. ఈ కార్యక్రమంలో వేదవిజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రహ్మణ్యఅవధాని, అధ్యాపకులు జీఏవీ దీక్షితులు, పి.సీతారామాచార్యులు, ఎస్వీ మోహనరంగాచార్యులు, వీఎన్ భట్టాచార్య, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.