మద్యం షాపులో చోరీ ఇంటి దొంగల పనే...

ABN , First Publish Date - 2020-12-31T04:26:27+05:30 IST

మద్యంషాపులో జరిగిన చోరీ కేసులో ఇద్దరి నిందితులను అరెస్ట్‌చేసి వారి నుంచి రూ.8,99,720 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రవిమనోహరాచారి చెప్పారు.

మద్యం షాపులో చోరీ ఇంటి దొంగల పనే...
నిందితులను అరెస్ట్‌ చూపుతున్న పోలీసులు

 ఇద్దరి అరెస్టు... రూ.8,99,720 స్వాధీనం


మదనపల్లె క్రైం, డిసెంబరు 30: మద్యంషాపులో జరిగిన చోరీ కేసులో ఇద్దరి నిందితులను అరెస్ట్‌చేసి వారి నుంచి రూ.8,99,720 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రవిమనోహరాచారి చెప్పారు. బుధవారం తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలను మీడియాకు వెల్లడించారు. మదనపల్లె మండలం కొండామర్రిపల్లె పంచాయతీ తురకపల్లెకు చెందిన ప్రశాంత్‌బాబు కుమారుడు పి.సుజీత్‌(23)గతేడాది అక్టోబరు నుంచి మదనపల్లె-పుంగనూరు మార్గంలోని బసినికొండలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. నిందితుడు స్నేహితులతో కలసి ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లు ఆడేవాడు. వాటికోసం రూ.లక్షలు అప్పులు చేసి నష్టపోయాడు. రుణదాతల ఒత్తిళ్లు, వేధింపులు భరించలేక ఏదైనా దొంగతనం చేసి అప్పులు తీర్చేయాలనుకున్నాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు తురకపల్లెకు చెందిన రహంతుల్లా కుమారుడు షేక్‌.అబ్దుల్‌కలాం అలియాస్‌ రంజానీ(21)కి చెప్పడంతో ఒప్పుకున్నాడు. ఇదిలావుండగా దుకాణ సూపర్‌వైజర్‌ ఇటీవల సెలవు పెట్టడంతో ఎక్సైజ్‌ అధికారులు షాపు బాధ్యతలను సుజీత్‌కు అప్పగించారు. ఈక్రమంలో ఈనెల 24 నుంచి 28వ తేదీవరకు విక్రయించిన మద్యం తాలూకా నగదు మొత్తం రూ.8,99,720 లక్షలు జమ అయింది. అయితే క్రిస్మస్‌ సందర్భంగా బ్యాంకులకు సెలవుకావడంతో సుజీత్‌ ఆ మొత్తాన్ని ఆదివారం రాత్రి క్యాష్‌చెస్ట్‌(ఇనుపపెట్టె)లో ఉంచి తాళం వేశాడు. దీన్ని అదునుగా చేసుకుని 28వ తేదీ అర్థరాత్రిలో స్నేహితుడు రంజానీతో కలసి ద్విచక్రవాహనంలో దుకాణం వద్దకొచ్చాడు. అక్కడ అరగంటపాటు వేచిఉండి తీరా వాచ్‌మెన్‌ నిద్రపోయాక దుకాణం తాళం తీసి లోపలికెళ్లారు. క్యాష్‌చెస్ట్‌కు కిందిభాగంలో అమర్చిన బోల్టులను ఊడదీశారు. అనంతరం క్యాష్‌చెస్ట్‌ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. గ్రామసమీపంలోకెళ్లి క్యాష్‌చెస్ట్‌ ఓపెన్‌ చేసి అందులోని రూ.8,99,720 నగదు తీసుకున్నారు. అనంతరం ఇనుపపెట్టెను ఆ పక్కనే వున్న వ్యవసాయ బావిలోపడేసి వెళ్లిపోయారు. ఆ మరుసటిరోజు మద్యం డిపో మేనేజరు గోపినాయుడు నగదు చోరీపై తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు వారు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే దర్యాప్తులో భాగంగా ఇదంతా ఇంటిదొంగల పనేనని తెలియడంతో దుకాణంలో పనిచేసే సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్లను అదుపులోకి తీసుకుని విచారించగా సుజీత్‌ నేరం అంగీకరించాడు. అనంతరం అతని స్నేహితుడు రంజానీని అరెస్ట్‌ చేయగా నిందితుల గుట్టు రట్టయింది. ఈ కేసులో నిందితులిద్దరినీ గురువారం కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ చెప్పారు. అదేవిధంగా నిందితుల సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనాన్ని సీజ్‌ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తాలూకా సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T04:26:27+05:30 IST