‘తిరుపతి’ ప్రస్తావన లేకున్నా..!

ABN , First Publish Date - 2020-12-16T04:46:12+05:30 IST

దేశవ్యాప్తంగా ఉన్న స్మార్టు సిటీల పురోగతిపై స్మార్ట్‌ సిటీ మిషన్‌ జాయింట్‌ సెక్రటరీ కునాల్‌ మంగళవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

‘తిరుపతి’ ప్రస్తావన లేకున్నా..!

స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులపై చర్చ జరిగిందంటూ మీడియాకు తప్పుడు సమాచారం


తిరుపతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉన్న స్మార్టు సిటీల పురోగతిపై స్మార్ట్‌ సిటీ మిషన్‌ జాయింట్‌ సెక్రటరీ కునాల్‌ మంగళవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇందులో తిరుపతి ప్రస్తావన రాకున్నా.. స్మార్టు సిటీ ప్రాజెక్టులపై చర్చ జరిగినట్లు మీడియాకు తప్పుడు సమాచారమిచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఈ వీడియో కాన్ఫరెన్సులో తిరుపతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ తరపున మేనేజింగ్‌ డైరెక్టర్‌ హోదాలో కమిషనర్‌ గిరీష, జీఎం చంద్రమౌళి, ఎస్‌ఈ మోహన్‌, ఎయికామ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణలోని కరీంనగర్‌, వరంగల్‌, అసోంలోని గౌహతి, హిమాచల్‌ ప్రదేశ్‌లోని స్మార్ట్‌ సిటీ పురోగతిపైనే చర్చ జరిగింది. తిరుపతి స్మార్ట్‌ సిటీ గురించి ప్రస్తావనే లేదు. అయితే కార్పొరేషన్‌ యంత్రాంగం మాత్రం తిరుపతిలో నిర్వహిస్తున్న తాత్కాలిక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ పనితీరు గురించి చర్చించినట్టు మీడియాకు తప్పుడు సమాచారమిచ్చింది. కొత్తగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అందుబాటులోకి వస్తే నగరాభివృద్ధి ఏవిధంగా ఉంటుందో పూసగుచ్చినట్టు వివరించినట్టు పేర్కొంది. ఎందుకిలా తప్పుడు సమాచారమిచ్చారనేది చర్చగా మారింది. కాగా, వైసీపీ అధికారంలోకి వచ్చాక వీడియో కాన్ఫరెన్స్‌, స్పందన కార్యక్రమాలకు మీడియాను అనుమతించడంలేదు. దీంతో ప్రజలకు ఖచ్చితమైన సమాచారం అందడంలేదు. ప్రజా సంబంధాలతో ముడిపడివున్న కార్పొరేషన్‌ వ్యవహారాలపై ప్రజలకు పారదర్శకమైన సమాచారం ఉండాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలి. 

Updated Date - 2020-12-16T04:46:12+05:30 IST