మళ్లీ మూడో విడత ఇంటింటి సర్వే ప్రారంభం

ABN , First Publish Date - 2020-04-09T12:21:45+05:30 IST

కరోనా లక్షణాలున్న వారిని గుర్తించడం కోసం గత రెండు దఫాలుగా గ్రామ, వార్డు వలంటీర్లు జరిపిన ఇంటింటి సర్వే నివేదికలను

మళ్లీ మూడో విడత ఇంటింటి సర్వే ప్రారంభం

ఈసారి వైద్య సిబ్బందితో కలిసి వలంటీర్ల సర్వే


కలికిరి, ఏప్రిల్‌ 8: కరోనా లక్షణాలున్న వారిని గుర్తించడం కోసం గత రెండు దఫాలుగా గ్రామ, వార్డు వలంటీర్లు జరిపిన ఇంటింటి సర్వే నివేదికలను ప్రభుత్వం పక్కన పెట్టినట్లే కనబడుతోంది. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలతో కలిసి ఇంటింటి సర్వే నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ బుధవారం నుంచి ఇంటింటి సర్వే మొదలైంది. గతంలో వలంటీర్లతో రెండు దఫాలుగా ఈ విధమైన సర్వే జరిగింది. గడిచిన సోమవారంతో రెండో విడత సర్వే కూడా పూర్తయ్యింది. ఆరోగ్య శాఖకు సంబంధం లేకుండా కరోనా లక్షణాలున్న వారిని, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడం కోసం ఈ రెండు సర్వేల్లో ప్రాధాన్యమిచ్చారు.


అయితే వలంటీర్లు ఇచ్చిన సర్వే నివేదికలకు, క్షేత్ర స్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులకు పొంతన లేకపోవడాన్ని ఆలస్యంగా గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా వైద్య సిబ్బందితో కలిసి వలంటీర్లను మళ్ళీ సర్వే నిర్వహించాల్సిందిగా ఆదేశించింది. బుధవారం నుంచి మొదలైన ఈ సర్వేలో ప్రతి ఇంట్లోని కుటుంబ సభ్యులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితులను నమోదు చేస్తున్నారు. దీనికనువుగా వైద్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. జలుబు, దగ్గు, జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులున్న వారిని గుర్తించి ఆ వివరాలను ఏఎన్‌ఎం లాగిన్‌లోకి పంపుతారు. వీరిని ఏఎన్‌ఎంలు మరోసారి పరీక్షించి అనుమానమున్న వారి వివరాలను సంబంధిత పీహెచ్‌సీ వైద్యాధికారి లాగిలో చేరవేస్తారు. దీంతో వైద్యాధికారులు ప్రతి ఒక్కరిని మళ్ళీ పరీక్షించి తీవ్రతనుబట్టి వారిని హోమ్‌ క్వారంటైన్‌కు పరిమితం చేయడమో లేక ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించడమో లేక ఆస్పత్రుల్లోని ఐసొలేషన్‌ వార్డులకు రెఫర్‌ చేయడమో చేయాల్సి వుంది. గత సర్వేలకు సంబంధం లేకుండా ప్రస్తుతం ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల సమక్షంలో మాత్రమే తాజాగా సర్వే చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిని మూడవ విడత కోవిడ్‌-19 ఇంటింటి సర్వేగా పిలుస్తున్నారు.


కాగా గతంలో వలంటీర్లు చేస్తున్న సర్వే హేతుబద్దంగా లేదని ఆరోగ్య శాఖకు సంబంధం లేకుండా జరిపే సర్వే వల్ల వుపయోగం లేదని పలువురు నిష్ణాతుల నుంచి వచ్చిన ఆక్షేపణలను ప్రభుత్వం పెడచెవిన పెట్టి తమ వలంటీర్లు చేసిన సర్వే మాత్రమే ప్రామాణికమైందిగా గొప్పలు చెప్పుకుంది. తీరా వాస్తవాలు వెల్లడయ్యేసరికి ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణకు అంగీకరించాల్సి వచ్చింది. కాగా ఇప్పటికే పలురకాల పనులతో తలమునకలుగా వున్న తమకు పదే పదే ఈ సర్వే అప్పగించడంపై వలంటీర్లు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-04-09T12:21:45+05:30 IST