అయినా.. ‘టెన్త్‌’ పరీక్షలా!

ABN , First Publish Date - 2020-03-23T10:11:07+05:30 IST

కరోనా కలవరపెడుతోంది..

అయినా.. ‘టెన్త్‌’ పరీక్షలా!

ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి

వాయిదా వేయాలని విద్యావేత్తల విజ్ఞప్తి


తిరుపతి(చిత్తూరు): కరోనా కలవరపెడుతోంది. ఒకవైపు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. 31వ తేది వరకు ప్రజారవాణాను బంద్‌ చేశారు. అత్యవసర దుకాణాలే అందుబాటులో ఉంటాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ పదో తరగతి పరీక్షలను యథాతథంగా (ఈనెల 31 నుంచి) నిర్వహిస్తామన్న సీఎం జగన్‌ ప్రకటనపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయంపై పునఃసమీక్షించి వాయిదా వేయాలని పలువురు కోరుతున్నారు. చిత్తూరు జిల్లాలో 53,494 మంది (27,708 మంది బాలురు, 25,786 మంది బాలికలు)కి 265 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 2700 మంది ఇన్విజిలేటర్లు అవసరం. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులూ పరీక్షా కేంద్రాలకు రావడం కారణంగా గుంపులుగా ఏర్పడొచ్చు. అది విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడొచ్చు. ఇక, రవాణాపరంగానూ సమస్యే. ఈ క్రమంలో పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అంటున్నారు. 


టెన్త్‌ పరీక్షలపై పునఃసమీక్షించండి: కత్తి నరసింహారెడ్డి, ఎమ్మెల్సీ 

పదో తరగతి పరీక్షలకు వారం మాత్రమే సమయం ఉంది. కరోనా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. పదిమందికి మించి ఒకచోట గుంపుగా ఉండకూడదని వైద్యశాఖ చెబుతోంది. ఇలాంటప్పుడు విద్యార్థులందరూ ఒకేచోట గుమిగూడటం ఆందోళన కలిగించే అంశం. వీటిని ప్రభుత్వం గుర్తించి.. పరిస్థితులపై సమీక్షించి, పరీక్షలు వాయిదా వేస్తే బాగుంటుంది. 


విద్యార్థుల ఆరోగ్యం చాలా ముఖ్యం: గంటా మోహన్‌, ఎస్టీయూ రాష్ట్ర నేత

పదో తరగతి పరీక్షలు యథాతథంగా నిర్వహించాలంటే ఉన్నతస్థాయి వైద్యనిపుణుల సూచనలు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. అదే తరహాలో విద్యార్థుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తే బాగుంటుంది. 


విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం: యండపల్లి శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ 

ప్రస్తుతం మనం విపత్కర పరిస్థితుల్లో ఉన్నాం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఇది చాలా మంచి నిర్ణయం. పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని అనుకోవడం ఆందోళన కలిగించే అంశం. పరీక్షలు వాయిదా వేయడం బాధాకరమే అయినా, ఆరోగ్యరీత్యా తప్పదు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. 


యథాతథంగా పరీక్షలు: నరసింహారెడ్డి, డీఈవో 

ఈ నెల 31 నుంచి వచ్చే నెల 17వ తేది వరకు పదో తరగతి పరీక్షలు యథాతథంగా ఉంటాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము పరీక్షలు నిర్వహిస్తాం. ఇందుకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలి. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. కరోనా బారినపడకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంటాం.


Updated Date - 2020-03-23T10:11:07+05:30 IST