సాంకేతిక పోటు.. పింఛన్లపై వేటు

ABN , First Publish Date - 2020-09-06T10:41:10+05:30 IST

జిల్లాలో నూతన పింఛన్ల మంజూరుపై సాంకేతిక పోటు పడింది. ఆ మేరకు.. 3369 మంది పింఛన్లు ఆగిపోగా, కొన్ని పరిష్కారానికి నోచుకోక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో వృద్ధులు,

సాంకేతిక పోటు.. పింఛన్లపై వేటు

 3369 మందికి అందని సొమ్ము 

 ఆన్‌లైన్‌ లోపాలపై లబ్ధిదారుల ఆందోళన 


చిత్తూరు, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నూతన పింఛన్ల మంజూరుపై సాంకేతిక పోటు పడింది. ఆ మేరకు.. 3369 మంది పింఛన్లు ఆగిపోగా, కొన్ని పరిష్కారానికి నోచుకోక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు తదితరులు 5.23 లక్షలకుపైగా వైఎస్సార్‌ పింఛను కానుక పొందుతున్నారు. కాగా, కొత్తగా పింఛను కోసం దరఖాస్తు చేసిన పదిరోజుల్లో అర్హులకు మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలు పింఛను మంజూరుపత్రాలు అందజేయాలి. సరైన ధ్రువపత్రం సమర్పించక పోవడం లేదా ఏదైనా పత్రం తిరస్కరణకు గురైతే దరఖాస్తుదారులు మళ్లీ వాటిని అందజేయాల్సి ఉంది.


వీటిని సమర్పించే సమయంలో అప్పటికే వారు పింఛను పొందుతున్నట్లు ఆన్‌లైన్‌లో చూపించడం సమస్యగా మారింది. ఇందుకు రియల్‌టైం గవర్నెన్స్‌ సేవలను పింఛను దరఖాస్తులకు అనుసంధానం చేయడమే కారణం. దీంతో పేదలకు అధికంగా భూములున్నట్లు, నాలుగుచక్రాల వాహనాలు కలిగి ఉన్నట్లు, ఒకే కార్డుకు రెండు పింఛన్లు ఉన్నట్లు, కుటుంబంలో ఉద్యోగులున్నట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తోంది. ఈ తప్పుడు సమాచారంతో జిల్లాలో 3369 మంది అర్హులు పింఛన్లు పొందలేని పరిస్థితి ఏర్పడింది. కాగా, ఈనెలాఖరు నాటికి అర్హుల జాబితాను అప్‌డేట్‌ చేసి, వచ్చేనెల నుంచి పింఛను పొందేలా చర్యలు తీసుకుంటామని డీఆర్‌డీఏ పీడీ డీఎంకే తులసి చెప్పారు. 

Updated Date - 2020-09-06T10:41:10+05:30 IST