మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల్లోని టీచర్లను బదిలీ చేయాల్సిందే
ABN , First Publish Date - 2020-11-14T05:15:19+05:30 IST
రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కొత్తగా విలీనమైన గ్రామాల్లోని పాఠశాలల్లో ఎనిమిదేళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరినీ తప్పనిసరిగా బదిలీ చేయాల్సిందేనని పాఠశాలల విద్యా శాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు సంబంధిత జిల్లా విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.
కలికిరి, నవంబరు 13: రాష్ట్రంలో నాలుగు జిల్లాల్లోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో కొత్తగా విలీనమైన గ్రామాల్లోని పాఠశాలల్లో ఎనిమిదేళ్ళ సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరినీ తప్పనిసరిగా బదిలీ చేయాల్సిందేనని పాఠశాలల విద్యా శాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు సంబంధిత జిల్లా విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం స్పష్టమైన వుత్తర్వులు జారీ చేశారు. విజయనగరం, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన కొంత మంది ఉపాధ్యాయులు చేసిన విజ్ఞప్తిని ఆయన ఈ సందర్భంగా తోసిపుచ్చారు. తాము పనిచేస్తున్న పాఠశాలలున్న గ్రామాలు మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లలో కొత్తగా విలీనమయ్యాయని, దీంతో ఎనిమిదేళ్ళ సర్వీసు పూర్తయినా ఎంపీపీ, జడ్పీపీ, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులతోపాటు తమను బదిలీచేయకుండా మినహాయించాలని వీరు కోరారు. తొమ్మిదేళ్ళ క్రితం ఇదే సందిగ్ధతలో ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, హై కోర్టు ఇచ్చిన వుత్తర్వులను చినవీరభద్రుడు ఈ సందర్భంగా ఉటంకించారు. 2011లో కడప మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో పనిచేసే ఉపాధ్యాయులు తమ బదిలీలను ఆపాలంటూ ఏపీటీఏని ఆశ్రయించారు. అక్కడ ఉపాధ్యాయుల వాదనను ఏపీటీఏ తోసిపచ్చింది. దీని పైన హై కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఉపాధ్యాయల వాదనకు చుక్కెదురయ్యింది. పాఠశాల విద్యా శాఖ ఆదేశాలకు బద్దులు కావలసిందేనంటూ ఉపాధ్యాయుల అప్పీల్‌ను హై కోర్టు తిరస్కరించింది. అంతేగాకుండా విలీనమైన గ్రామాల్లోని పాఠశాలలను, ఉపాధ్యాయులను కూడా ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేస్తే తప్ప అంత వరకూ వీరంతా ఎంపీపీ, జడ్పీపీ, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులుగానే పరిగణింపబడుతారని డైరెక్టర్ ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అదే విధంగా ప్రస్తుతం మినహాయింపు కోరుకుంటున్న నాలుగు జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులను కూడా ఎంపీపీ, జడ్పీపీ, ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఒకే యూనిట్టు వారిగానే పరిగణించి బదిలీలు చేపట్టాలనీ డీఈవోలను ఆదేశింశారు.