ప్రజల మనోభావాలు దెబ్బతీయడమే..

ABN , First Publish Date - 2020-08-01T10:33:19+05:30 IST

మూడు రాజధానుల బిల్లును గవర్నర్‌ ఆమోదించడం అన్యాయమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.

ప్రజల మనోభావాలు దెబ్బతీయడమే..

 మూడు రాజధానుల బిల్లు ఆమోదంపై టీడీపీ

నేడు వాడవాడలా నిరసన కార్యక్రమాలు 


చిత్తూరు సిటీ, జూలై 31: మూడు రాజధానుల బిల్లును గవర్నర్‌ ఆమోదించడం అన్యాయమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, ప్రధాన కార్యదర్శి నరసింహయాదవ్‌, ఎమ్మెల్సీలు దొరబాబు, గౌనివారి శ్రీనివాసులు, కార్యాలయ సమన్వయ కార్యదర్శి సురేంద్ర కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.శాసనమండలిలో ఆమోదం పొందకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన ఈ బిల్లును గవర్నర్‌ ఆమోదించడం అంటే.. ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేన న్నారు. ఇది చరిత్రలో చీకటిరోజుగా మిగిలిపోతుందని విమర్శించారు. రాష్ట్రాన్ని నిర్వీర్యం చేయడానికి సీఎం జగన్‌ కంకణం కట్టుకుంటే.. అందుకు గవర్నర్‌ సహకరిస్తున్నారని ఆరోపించారు.


మూడు రాజధానులు దేశంలో ఎక్కడా లేవని.. దీనివల్ల రాష్ట్రాభివృద్ధి స్తంభించి పోతుందన్నారు. అమరావతి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులను ప్రభుత్వం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానులతో జగన్‌కు రాజకీయ పతనం ప్రారంభమవుతుందని జోస్యం చెప్పారు. పైగా ఈ నిర్ణయం న్యాయ సమీక్షలో నిలవదన్నారు. గవర్నర్‌ నిర్ణయాన్ని టీడీపీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మండల,పట్టణ,నియోజకవర్గ కేంద్రాల్లో శనివారం అమరావతి రాజధానికోసం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


Updated Date - 2020-08-01T10:33:19+05:30 IST