ఉదయం కట్టారు..సాయంత్రం కొట్టేశారు !
ABN , First Publish Date - 2020-04-28T10:48:16+05:30 IST
కరోనా వ్యాప్తి నివారణకు తమిళనాడు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది.

గుడిపాల, ఏప్రిల్ 27: కరోనా వ్యాప్తి నివారణకు తమిళనాడు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా సరిహద్దు ప్రాంతమైన గుడిపాల మండలం మండీకృష్ణాపురం పంచాయతీ పెరుమాళ్లకుప్పం సమీపంలో సోమవారం ఉదయం రోడ్డుకు అడ్డంగా గోడ కట్టారు. దీంతో గుడిపాల మండలం మండీకృష్ణాపురం, పెరుమాళ్లకుప్పం, నంగమంగళం, శాంతిపురం, పెరుమాళ్లకండ్రిగ, అటు తమిళనాడు రాష్ట్రం ఒట్టంతంగాల్, కసం, ఉల్లిపుత్తూరు గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే తమిళనాడు ప్రభుత్వం పెరుమాళ్లకుప్పం వద్ద గోడ కట్టినా.. చిత్తూరు-వేలూరు, బెంగళూరు-చెన్నై రహదారి మీదుగా మండల ప్రజలు ప్రయాణించవచ్చని గుడిపాల రెవెన్యూ అధికారులు పేర్కొన్నారు.అయితే సాయంత్రానికి ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ గోడను తొలగించారు.చిత్తూరు ఆర్డీవో రేణుక దగ్గరుండి పర్యవేక్షించారు.