స్వర్ణముఖి నదిలో గల్లంతైన దంపతులు మృతి

ABN , First Publish Date - 2020-12-13T05:49:15+05:30 IST

ఏర్పేడు మండలం మోదుగులపాళెం వద్ద స్వర్ణముఖి నదిలో గల్లంతైన దంపతులు మృతి

స్వర్ణముఖి నదిలో గల్లంతైన దంపతులు మృతి
సుబ్బలక్ష్మి మృతదేహం

ఏర్పేడు, డిసెంబరు 12: ఏర్పేడు మండలం మోదుగులపాళెం వద్ద స్వర్ణముఖి నదిలో గల్లంతైన దంపతులు మృతి చెందారు. సుమారు కిలోమీటరు దూరంలో నాగరాజు, సుబ్బలక్ష్మి మృతదేహాలను ఎస్‌డీఎఫ్‌ బృందం శనివారం గుర్తించి వెలికితీసింది. సీఐ శివకుమార్‌రెడ్డి కథనం మేరకు.. కుమ్మరిమిట్టకు చెందిన సుబ్బలక్ష్మి(28), నాగరాజు(30) దంపతులు సంచార జీవనం గడుపుతున్నారు. వీరి కుమార్తె దివ్య(12) కొత్తవీరాపురంలోని సుబ్బలక్ష్మి సోదరి రాధమ్మ సంరక్షణలో ఉంది. గురువారం రాత్రి కొత్తవీరాపురం నుంచి కుమ్మరిమిట్టలో ఉంటున్న నాగరాజు సోదరి గజ్టెల రత్నమ్మ ఇంటికి వస్తూ స్వర్ణముఖి వంతెన మీద నీటి ఉధృతికి కొట్టుకుపోయారు. దీనిని గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చారు. శుక్రవారం సీఐ శివకుమార్‌రెడ్డి, తహసీల్దారు ఉదయసంతోష్‌ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బందిని రప్పించి గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం వంతెనకు కిలోమీటరు దూరంలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం జరిపి రత్నమ్మకు అప్పగించారు. సుబ్బలక్ష్మి మృతదేహాన్ని ఆమె సమీప బంధువులు శ్రీకాళహస్తి మండలం తొండమనాడు అరుంధతివాడకు తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. సీఐ శివకుమార్‌రెడ్డి కేసు నమోదు చేశారు.



Updated Date - 2020-12-13T05:49:15+05:30 IST