‘స్వర్ణముఖి’కి రాజకీయ గ్రహణం

ABN , First Publish Date - 2020-07-15T10:04:41+05:30 IST

స్వర్ణముఖి నదిలో స్నానం చేస్తే సకల పాపాలు హరించుకు పోవడంతో పాటు పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం.

‘స్వర్ణముఖి’కి రాజకీయ గ్రహణం

 ఆగిన అమృత్‌ పథకం పనులు

మురుగుతున్న రూ.26కోట్ల నిధులు


 స్వర్ణముఖినది అభివృద్ధి పనులకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. టీడీపీ హయాంలో పనులు ప్రారంభించారనే కారణంతో అమృత్‌ పథకం కింద మంజూరైన పనులను అర్ధంతరంగా ఆపేశారు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.26 కోట్లు మురిగి పోతున్నాయి.  


శ్రీకాళహస్తి, జూలై 14:స్వర్ణముఖి నదిలో స్నానం చేస్తే సకల పాపాలు హరించుకు పోవడంతో పాటు పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. మృతి చెందిన వారి అస్థికలు ఈ నదిలో కలిపితే వారు స్వర్గానికి వెళతారన్న భావనతో పిండప్రదానం చేయడానికి, అస్థికలు కలపడానికి ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి శ్రీకాళహస్తికి వస్తుంటారు. ఇంతటి పవిత్రత కలిగిన స్వర్ణముఖినది నేడు మురికి కూపంగా మారింది. ముక్కంటి ఆలయంతో పాటు సన్నిధివీధి, తేరువీధి, పిట్టలవారిసందు తదితర ప్రాంతాల్లో ఉన్న లాడ్జీలు, హోటళ్లు, నివాసగృహాల నుంచి వచ్చే మురుగునీటిని నదిలోకి విడుదల చేసేస్తున్నారు. ఈ కారణంగా నదిలోని నీరు మొత్తం మురుగుగా మారిపోతోంది. ఇలాంటి నీటిలో స్నానం చేయడానికి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్వర్ణముఖి నది పవిత్రతను కాపాడడానికి గత తెలుగుదేశ ప్రభుత్వం నడుం బిగించింది. అప్పటి శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఈ సమస్యను అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి  వెంకయ్య నాయుడి దృష్టికి తీసుకెళ్లారు.


శ్రీకాళహస్తిని అమృత్‌ పట్టణాల జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనల ప్రకారం లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాలను మాత్రమే జాబితాలో చేర్చాల్సి వున్నా.. నిత్యం ఇక్కడకు వచ్చే భక్తులను కూడా పరిగణనలోకి తీసుకుని అమృత్‌ జాబితాలోకి చేర్చారు.తరువాత స్వర్ణముఖినదిలో సీవరేజ్‌ ట్రీట్‌మెంటు ప్లాంటు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపారు. ఇందుకు కేంద్రప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. స్వర్ణముఖినదిలోకి వచ్చే మురుగునీటిని తీసుకెళ్లడానికి పైపులైను, మురికి నీటి శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయడానికి అమృత్‌ పథకం కింద రూ.26కోట్లు విడుదల చేశారు. టెండరు ప్రక్రియ పూర్తయిన తరువాత ఈ పనులకు 2018 అక్టోబరు 29న భూమి పూజ  చేశారు. అదేరోజు సన్నిధి వీధిలో జలవినాయకుడి ఆలయ సమీపంలో స్వర్ణముఖినది ఒడ్డున శిలాఫలకం ఆవిష్కరించారు. ఆ తరువాత వాతావరణం అనుకూలించకపోవడంతో కొన్ని నెలల పాటు పనులు ఆపేశారు. తూర్పు మండలాల్లో వర్షాలు తగ్గిన తరువాత పనులు ప్రారంభించారు. సన్నిధివీధిలోని జలవినాయస్వామి ఆలయ సమీపం నుంచి శ్రీకాళహస్తి పట్టణ శివారులో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఉన్న వంతెన సమీపం వరకు నదికి ఇరువైపులా పైపులైను ఏర్పాటు చేయడం...  వంతెన సమీపంలో సీవరేజ్‌ ట్రీట్‌మెంటు ప్లాంటు నిర్మించి... అందులోకి ఈ మురుగునీటిని వదలడం.


ఆ తరువాత ఈ ప్లాంటులో శుద్ధి చేసిన నీటిని మళ్లీ స్వర్ణముఖినదిలోకి విడుదల చేయడం....లేదా వ్యవసాయ అవసరాలకోసం చెరువులకు పంపడం  లాంటి ఉన్నతాశయంతో ఈ పనులకు శ్రీకారం చుట్టారు. సాధారణ ఎన్నికలకు మునుపే స్వర్ణముఖినది అభివృద్ధి పనులను ప్రారంభించారు. బైపాస్‌ వంతెన సమీపంలో సిమెంటు పైపులు, ఇసుక, స్టీలు వంటి సామగ్రిని నిల్వ చేశారు. నదిలో కొంతదూరం పైపులైను కూడా వేశారు. ఈ పనులకు సుమారు రూ.2కోట్ల వరకు వెచ్చించారు. పనులు వేగంగా జరిగే సమయంలో సాధారణ ఎన్నికలు రావడం... రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఈ పనులు నిలిచిపోయాయి.


రివర్స్‌ టెండరు పేరుతో...

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 25శాతం కంటే తక్కువ చేసిన పనులను రద్దు చేయాలని నిర్ణయించింది. వీటికి రీ-టెండర్లు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. స్వర్ణముఖినది అభివృద్ధి పనులు కూడా 25శాతం లోపే జరిగి ఉండడంతో రద్దు జాబితాలోకి చేర్చారు. ఈ కారణంగా పనులు ఆగి పోయాయి. వైసీపీ అఽధికారంలోకి వచ్చి ఏడాది దాటి పోయినా ఈ పనులను గురించి ఎవరూ పట్టించుకోలేదు.పనులు ఆలస్యం చేసే కొద్దీ అంచనా విలువ మరింత పెరుగుతుంది. వ్యయం పెరిగితే నిధుల సమస్య వచ్చే అవకాశం ఉంది. ధరలు పెరిగిన నేపథ్యంలో గతంలో టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరు కూడా పనులు చేయడానికి సుముఖత చూపడం లేదని ప్రచారం జరుగుతోంది. 


స్వర్ణముఖినది పనులు ప్రారంభిస్తాం...బియ్యపు మధు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

స్వర్ణముఖినది అభివృద్ధి పనులు పునఃప్రారంభించడానికి అధికారులతో చర్చిస్తున్నాం. సీవరేజ్‌ ట్రీట్‌మెంటు ప్లాంటు వేరే చోట నిర్మించాలని సూచించారు. ఇందుకు అవసరమైన స్థలం సేకరించాలని తహసీల్దారును ఆదేశించాం. స్వర్ణముఖినదిని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. వీలైనంత త్వరగా ఈ పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-07-15T10:04:41+05:30 IST