స్విమ్స్‌లో అసలేం జరుగుతోంది?

ABN , First Publish Date - 2020-09-16T16:14:28+05:30 IST

నెలన్నర క్రితం ఒక డాక్టర్‌ పాజిటివ్‌ అయ్యారు. ఊపిరితీసుకోవడం కాస్త కష్టంగా..

స్విమ్స్‌లో అసలేం జరుగుతోంది?

తిరుపతి(ఆంధ్రజ్యోతి): నెలన్నర క్రితం ఒక డాక్టర్‌ పాజిటివ్‌ అయ్యారు. ఊపిరితీసుకోవడం కాస్త కష్టంగా ఉండడంతో స్విమ్స్‌ పద్మావతి కొవిడ్‌ సెంటర్‌లో అడ్మిట్‌ అయ్యారు. డాక్టర్లు గానీ, సిబ్బంది గానీ పెద్దగా వార్డుల్లోకి రాకపోవడం ఆయన గమనించారు. తెల్లవారు జామున నర్సులు అద్దాల్లోంచి లోపలికి చూస్తారు. వెంటిలేటర్‌లలో బీప్‌ శబ్దం ఆగిపోయి ఉంటే ఆ బెడ్‌ మీద పేషెంట్‌ చనిపోయినట్లు నిర్ధారించుకుని డాక్టర్లకు సమాచారం ఇస్తున్నారు. ఈ తీరు చూసిన ఆయన భయపడిపోయారు. డిశ్చార్జి చేయించుకుని ప్రైవేటు ఆస్పత్రికి పరుగులు తీశారు.  


..ఇది స్విమ్స్‌ కోవిడ్‌ ఆస్పత్రిలో వైద్య సేవల తీరుకు ఒక ఉదాహరణ మాత్రమే. వందలాదిమంది డాక్టర్లు, నర్సులు, అనుభవజ్ఞులైన నిపుణులు ఉన్న స్విమ్స్‌ ఆధ్వర్యంలో నడిచే కొవిడ్‌ ఆస్పత్రి కరోనా బాధితులకు కనీస నమ్మకం ఇవ్వలేకపోతోంది. మంచి వైద్యం అందుతుందనే భరోసా కల్పించలేకపోతోంది. మరోవైపు మరణాలు లెక్కకు మిక్కిలిగా ఈ ఆస్పత్రిలో నమోదవుతున్నాయి. ఈ ఆస్పత్రి నిర్లక్ష్యం గురించి ప్రచారమవుతున్న అనేక అంశాలు ప్రజల్ని ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీయిస్తున్నాయి.  లక్షల బిల్లులతో బెంబేలెత్తే అనివార్య పరిస్థితిని కల్పిస్తున్నాయి. 


నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా? 

450 పడకల సామర్థ్యంగల స్విమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో పదో ఇరవయ్యో తప్ప దాదాపుగా  పడకలన్నీ నిండి పోయే ఉంటాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి ఈ ఆస్పత్రికి రోగులను తరలిస్తుంటారు. అనేక ప్రత్యేక విభాగాలు అందుబాటులో ఉన్న సంస్థ కావడంతో వైరస్‌ దాడిలో ఇతర అనారోగ్య సమస్యలు ఎదురైనా మెరుగైన వైద్యం అందుతుందన్న నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు. విచిత్రమైన అంశం ఏమిటంటే, కొవిడ్‌ చికిత్సలో కీలకమైన పల్మనాలజిస్టులు ఒక్కరు కూడా ఈ ఆస్పత్రిలో లేకపోవడం. అసలు స్విమ్స్‌లోనే పల్మనాలజీ విభాగం లేదు. అయినా రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆస్పత్రిగా అనుమతి ఇచ్చేశారు. ఫిజీషియన్ల మీదే ప్రస్తుతం కొవిడ్‌ ఆస్పత్రి వైద్యం నడుస్తోంది. 


ఇందరున్నా కొరతేనా?

స్విమ్స్‌లో 115 మంది వివిధ విభాగాల్లో డాక్లర్లున్నారు. తాత్కాలిక ప్రాతిపదిక మీద మరో 80మంది పనిచేస్తున్నారు. వీరు గాక పీజీ చేస్తున్న డాక్టర్లు 110మంది ఉన్నారు. ఇప్పటిదాకా స్విమ్స్‌లో ఓపీ సేవలు కూడా లేవు. అయినా వీరందరి సేవలు కొవిడ్‌ ఆస్పత్రికి అందడం లేదు. 300మందికి పైగా ఉన్నా ఆస్పత్రి నుంచి కేవలం 70మంది డాక్టర్లు, పీజీలు కొవిడ్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఇక 450మంది నర్సులున్న స్విమ్స్‌.. కొవిడ్‌ సేవలకు 80 మంది సేవలనే వినియోగించుకుంటోంది. వీరంతా కూడా షిఫ్ట్‌ పద్ధతిలో పనిచేస్తుంటారు.


వాస్తవం ఏమిటంటే వీరిలో సీనియర్‌ డాక్టర్లు ఎవరూ అందుబాటులో ఉండరు. అవసరమైనప్పుడు మాత్రమే హాజరవుతారు. పీజీలు మాత్రమే విధులకు హాజరవుతారు.  తొలి రెండు షిఫ్ట్‌ల్లో ఆరేడుగురు పీజీ డాక్టర్లు, రాత్రి 12మంది డ్యూటీల్లో ఉంటున్నారు. ఇన్ని వందలమందికి క్రిటికల్‌ కేర్‌ అవసరమైన చోట ఇంత తక్కువమంది డాక్టర్లు ఉండడం వల్లనే అవసర సమయాల్లో వైద్య సాయం అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకు వైద్యులందరి సేవలనూ వినియోగించు కోవడం లేదన్నది అర్థం కాని ప్రశ్న.  


19 కోట్ల వెంటిలేటర్లు ఏం చేశారు?

స్విమ్స్‌ ప్రధానంగా టీటీడీ ఆర్ధిక అండతో నడిచే సంస్థ. ఏడాదికి 60 కోట్లు టీటీడీ ఇస్తుంది. స్విమ్స్‌ ఆధ్వర్యంలో నడిచే కొవిడ్‌ ఆస్పత్రి కావడంతో మౌలిక సదుపాయాల కోసం అత్యవసరంగా 19 కోట్ల రూపాయలు విడుదల చేసింది.ఈ మొత్తంతో హడావుడిగా 100 వెంటిలేటర్లు కొన్నట్లు సమాచారం. ఈ వెంటిలేటర్ల ధర మీద వివాదం విమర్శలు పక్కన పెడితే కొన్న వెంటిలేటర్లను వినియోగంలోకి తీసుకురాకపోవడం ఆశ్చర్య పరుస్తుంది.


కనీసం 30 కూడా వినియోగంలో లేవని తెలుస్తోంది. మరి ఇన్ని కోట్ల దేవుడి సొమ్ము వృధా అవుతూ ఉంటే టీటీడీ కూడా పెద్దగా పట్టించుకోకపోవడం విస్తుపోయేలా చేస్తోంది.అనస్థీషియన్లు, టెక్నీషియన్లు తగినంతమంది లేకపోవడం వల్ల వాడుకోవడం లేదన్న వాదన ఉంది. మరి ఇన్ని కోట్లు పోసి ఎందుకు కొన్నట్లు? సిబ్బంది కొరతను పూరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చినా ఎందుకు ఇంకా వాటిని వృథాగా ఉంచుతున్నట్లు?


ఇవి చేయలేరా?

- స్విమ్స్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో డాక్టర్ల సంఖ్యను, నర్సుల సంఖ్యను, ఇతర సిబ్బంది సంఖ్యను పెంచాలి. 

- ఆరు గంటలకు మించకుండా డ్యూటీలు వేయాలి. 

- ప్రతి రోగి బెడ్‌ మీదా కేస్‌ షీట్‌ ఉండాలి. రౌండ్‌కి వచ్చిన డాక్టర్లు తప్పనిసరిగా వివరాలు నమోదు చేయాలి.

- క్రిటికల్‌ కేర్‌ వార్డుల్లో సిబ్బంది ఉండే ఏర్పాటు చేయాలి.

- ఆస్పత్రిలోని టాయ్‌లెట్ల నిర్వహణ మెరుగు పరచాలి.

- రోగికి అందుతున్న వైద్యం ఏమిటో, కండీషన్‌ ఏమిటో కుటుంబ సభ్యులకు రోజూ సమాచారం ఇవ్వగలగాలి.

- ఆస్పత్రి బయట హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేయాలి.

- రోగి మరణించిన వెంటనే మృతదేహాన్ని మార్చురీకి తరలించే ఏర్పాటు చేయాలి.

-  పీపీఈ సూట్‌లో బెడ్‌ దగ్గరకు వస్తున్న వారిలో డాక్టర్‌ ఎవరో, నర్సు ఎవరో, సిబ్బంది ఎవరో తెలిసే ఏర్పాటు ఉండాలి.

- స్విమ్స్‌ డైరెక్టర్‌ మొదలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తగిన జాగ్రత్తలతో తరచూ ఆస్పత్రి లోపలికి వెళ్ళి రోగులను పరామర్శించాలి. 



Updated Date - 2020-09-16T16:14:28+05:30 IST