శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి అధ్యయనోత్సవాలు
ABN , First Publish Date - 2020-12-13T06:39:38+05:30 IST
శ్రీవారి ఆలయంలో సోమవారం నుంచి జనవరి ఏడో తేదీ వరకు అఽధ్యయనోత్సవాలు జరగనున్నాయని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు.

టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి
తిరుమల, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి ఆలయంలో సోమవారం నుంచి జనవరి ఏడో తేదీ వరకు అఽధ్యయనోత్సవాలు జరగనున్నాయని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం తర్వాత మీడియాతో మాట్లాడారు. 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధంలోని 4వేల పాశురాలను ఆలయంలోని రంగనాయక మండపంలో 25 రోజుల పాటు శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారన్నారు. ఈనెల 30వ తేదీన ప్రణయకలహోత్సవం జరుగుతుందన్నారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ అంతం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ నవంబరు 30వ తేదీన తిరుపతిలో కార్తీక మహాదీపోత్సవం, డిసెంబరు11న విశాఖలో శ్రీవారి కార్తీక సహస్ర దీపోత్సవం నిర్వహించామన్నారు. వేదవర్సిటీలోని ధ్యానారామంలో రోజూ ఉదయం 6 నుంచి 6.45 గంటల వరకు రుద్రాభిషేకం నిర్వహిస్తున్నామన్నారు. తిరుమల నాదనీరాజనం వేదికపై కార్తీక మాసం విశిష్టతను తెలిపే ప్రవచనాలు జరుగుతున్నాయని వివరించారు.