-
-
Home » Andhra Pradesh » Chittoor » stopped wedding
-
పీటలమీద ఆగిన పెళ్లి
ABN , First Publish Date - 2020-11-21T06:23:00+05:30 IST
ప్రియుడితో ఓవైపు ప్రేమాయణం సాగిస్తూనే మరొకవైపు ఇంకొక యువకుడితో పెళ్లికి సిద్ధపడిన ఓ యువతి కొన్ని గంటల వ్యవధిలో తాళి మెడలో పడుతుందని భావించి చాకచక్యంగా ప్రియుడితో పోలీసులకు ఫిర్యాదు చేయించి పెళ్లిని అర్ధాంతరంగా నిలిపి వేసిన సంఘటన గురువారం రాత్రి గుర్రంకొండలో జరిగింది.

ఇష్టం లేకుండా చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయించిన వధువు
గుర్రంకొండ, నవంబరు 20: ప్రియుడితో ఓవైపు ప్రేమాయణం సాగిస్తూనే మరొకవైపు ఇంకొక యువకుడితో పెళ్లికి సిద్ధపడిన ఓ యువతి కొన్ని గంటల వ్యవధిలో తాళి మెడలో పడుతుందని భావించి చాకచక్యంగా ప్రియుడితో పోలీసులకు ఫిర్యాదు చేయించి పెళ్లిని అర్ధాంతరంగా నిలిపి వేసిన సంఘటన గురువారం రాత్రి గుర్రంకొండలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. గుర్రంకొండకు చెందిన ఓ యువకుడికి కడప నగరానికి చెందిన ఓ యువతితో ఈ నెల 20వ తేదీన పెద్దలు పెళ్లి చేయడానికి నిశ్చయించారు. పెళ్లి కుమార్తె చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. యువతి అక్కడ ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయాన్ని దాచివుంచి తల్లిదండ్రులు చూసిన యువకుడితో పెళ్లికి సిద్ధపడింది. దీంతో ఇరువర్గాల వారు పెళ్లి పనులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 5.15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె బంధువులందరూ గురువారం సాయంత్రం గుర్రంకొండలోని పెళ్లి మండపానికి చేరుకున్నారు. రిసెప్షన్ ఏర్పాటు చేసి కుటుంబాల వారీగా ఫొటోలు తీసుకున్నారు. రిసెప్షన్ పూర్తికాగానే తాంబూల సంప్రదాయాన్ని పూర్తి చేశారు. ఇంకొన్ని గంటల వ్యవధిలో వధూవరులకు పెళ్లి జరగాల్సి ఉంది. ఈ క్రమంలో యువతి చాకచక్యంగా ప్రియుడితో గురువారం రాత్రే పోలీసు ఉన్నతాధికారులకు తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయించింది. దీంతో గుర్రంకొండ పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు మండపానికి చేరుకుని పెళ్లిని ఆపి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం యువతిని తహసీల్దార్ అమరనాథ్ ముందు హాజరుపరిచి తల్లిదండ్రులకు అప్పగించారు. గంటల వ్యవధిలో జరగాల్సిన పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోవడం పలువురిని విస్మయానికి గురి చేసింది.