శేషుడిపై శ్రీహరి కన్నులపండువగా మొదలైన శ్రీవారి వాహనసేవలు
ABN , First Publish Date - 2020-09-20T10:55:10+05:30 IST
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు రాత్రి శ్రీనివాసుడు పెద్దశేష వాహనంపై పరమపదనాథుడి అవతారంలో ద ర్శనమిచ్చా

తిరుమల, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు రాత్రి శ్రీనివాసుడు పెద్దశేష వాహనంపై పరమపదనాథుడి అవతారంలో ద ర్శనమిచ్చారు. కొవిడ్ నేపథ్యంలో ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలోనే వాహనసేవలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో శనివారం రాత్రి 8.30 నుంచి 9.30 గంటల మఽధ్య శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై అనుగ్రహించారు.స్వామివారికి పానుపుగా, దిండుగా, పాదుకలుగా, ఛత్రంగా, వాహనంగా సేవచేస్తుండే శేషుడిని దర్శిస్తే పశుత్వం తొలగి మానవత్వం, దాని నుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయని భక్తకోటి నమ్మకం.దేవేరులతో సహా స్వామివారిని కల్యాణోత్సవ మండపంలో పెద్దశేష వాహనంలో కొలువుదీర్చి దివ్యప్రబంధం, వేదపారాయణం పఠనం చేసి హారతులు, నైవేద్యం సమర్పించారు.
అంతకుముందు సాయంత్రం 6.03-6.30 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం కన్నులపండువగా నిర్వహించి వార్షిక బ్రహ్మోత్సవాలకు నాంది పలికారు.వేదమంత్రోచ్ఛారణ మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి సమక్షంలో గరుడధ్వజాన్ని ఎగురవేశారు.
గోవిందాచార్యులు కంకణభట్టర్‌గా వ్యవహరించారు. అనంతరం తిరుమలరాయ మండపంలో ఆస్థానం చేపట్టారు. ధ్వజారోహణ ఘట్టానికి ముందు సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీవారి ఉత్సవమూర్తులను, పరివార దేవతలైన అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి, ధ్వజపటాన్ని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగించారు. ఈ కార్యక్రమాల్లో జీయర్‌స్వాములు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, బోర్డుసభ్యులు అనంత, శివకుమార్, కుమారగురు , ఈవో సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.