‘సోమశిల-స్వర్ణముఖి’పై సవతిప్రేమ

ABN , First Publish Date - 2020-12-14T05:07:47+05:30 IST

సోమశిల - స్వర్ణముఖి అనుసంధాన కాలువ పనులు వేగవంతం చేయడానికి అవసరమైన నిధులు ప్రభుత్వం కేటాయించడం లేదు

‘సోమశిల-స్వర్ణముఖి’పై సవతిప్రేమ
ఏర్పేడు మండలంలో అసంపూర్తిగా ఉన్న సోమశిల-స్వర్ణముఖి అనుసంధాన కాలువ

పెండింగ్‌ బిల్లులు రూ.20కోట్లు... కేటాయింపు రూ.10కోట్లు

ప్రాజెక్టు పూర్తికి కావాల్సింది రూ.420కోట్లు


శ్రీకాళహస్తి, డిసెంబరు 13: సోమశిల - స్వర్ణముఖి అనుసంధాన కాలువ పనులు వేగవంతం చేయడానికి అవసరమైన నిధులు ప్రభుత్వం కేటాయించడం లేదు. మన జిల్లా పరిధిలో గల 17వ ప్యాకేజీకి సంబంధించి పెండింగ్‌ బిల్లులు రూ.20కోట్లకు పైగా ఉంటే... గత బడ్జెట్‌లో రూ.10కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ కాలువ గుండా నీరు పారాలంటే ఇంకా రూ.420కోట్లు వరకు వెచ్చించాల్సి ఉంటుందని ఇంజనీరింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలోని డక్కిలి, రాపూరు, వెంకటగిరి... చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాలకు సాగు, తాగునీటిని అందించాలనే ఆశయంతో 2006లో సోమశిల-స్వర్ణముఖి అనుసంధాన కాలువ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కాలువ ద్వారా ఏడాదికి 4.45 టీఎంసీల నీటిని తరలించాలని అప్పట్లో లక్ష్యంగా ఎంచుకున్నారు. ఈ ఐదు మండలాల పరిధిలో స్థిరీకరణయ్యే ఆయకట్టు 78,764 ఎకరాలు. ఇది కాకుండా అదనంగా మరో 12వేల ఎకరాలకు సాగునీరు... ఐదు 2.50లక్షల మందికి తాగునీరు అందించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. అయితే నిధుల కేటాయింపుల విషయంలో పాలకులు నిర్లక్ష్యం చూపుతుండటంతో పనులు ముందుకు సాగడంలేదు. వైపీపీ అధికారంలోకి వచ్చి ఏడాదన్నర అవుతున్నా... కనీసం ఈ కాలువలో పార మట్టి కూడా తీయలేదు. మన జిల్లాలో ఏర్పేడు మండలంలోని నాగంపల్లె వరకు పనులు జరిగాయి. ఇక్కడ నుంచి తొండమనాడుచెరువు వరకు కాలువ తవ్వాల్సి ఉంది. ఈ పనులు(17వ ప్యాకేజీ) పూర్తి చేయడానికి ప్రస్తుత ధరల ప్రకారం రూ.30కోట్లు కావాల్సి ఉంటుందని ఇంజనీరింగ్‌శాఖ అధికారుల అంచనా. ఇవి కాకుండా నెల్లూరు జిల్లా పరిధిలో డక్కిలి మండలం ఆల్తూరుపాడు రిజర్వాయరు పనులు పూర్తి చేయాల్సి ఉంది. అదేవిధంగా ఎత్తిపోతల పనులు చేపట్టాలి. ఈ పనులు పూర్తి చేయడానికి సుమారు రూ.420కోట్లు కావాలని అంచనా. ఆల్తూరుపాడు రిజర్వాయరు సామర్థ్యం 1.008 టీఎంసీలు. దీని నిర్మాణం పూర్తయితే లింక్‌ కెనాల్‌ ద్వారా రోజుకు 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి... 316 చెరువులను నింపాలన్నది లక్ష్యం. అభయారణ్యం, అటవీ అనుమతుల్లో జాప్యం వల్ల ప్రాజెక్టు డిజైన్‌ మార్చారు. సత్యసాయి గంగ (తెలుగుగంగ) కాలువ 34.10కి.మీ. వద్ద నుంచి అంటే నెల్లూరు జిల్లా డక్కిలి మండలం ఆల్తూరుపాడు వద్ద రిజర్వాయరులోకి ఎత్తి పోసే విధంగా నూతన డిజైన్‌ రూపొందించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 50వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. అయితే పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ప్రభుత్వం విడుదల చేయడం లేదు. దీంతో నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. ఈ పనులు పూర్తయితే కాలువ పరివాహక ప్రాంతాల్లో తాగునీటి సమస్య కూడా తీరనుంది. పాలకులు ఇకనైనా సోమశిల-స్వర్ణముఖి అనుసంధాన కాలువ పనులపై శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2020-12-14T05:07:47+05:30 IST