సౌర విద్యుత్తుపై.. తిరుపతి నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2020-10-14T16:57:50+05:30 IST

తిరుపతి నగరపాలక సంస్థ సౌర విద్యుత్తుపై ప్రత్యేక దృష్టి సారించింది. శ్రీకాళహస్తి సమీపంలోని..

సౌర విద్యుత్తుపై.. తిరుపతి నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి

స్మార్ట్‌ పవర్‌ 

స్మార్టుసిటీ నిధులతో పది మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తికి చర్యలు 

ఇప్పటికే కైలాసగిరిలో ఫ్లోటింగ్‌ ప్లాంట్‌ ద్వారా 4 మెగావాట్ల తయారీ 

మరో నెలలో అందుబాటులోకి రానున్న తూకివాకం ప్లాంటు 


తిరుపతి, ఆంధ్రజ్యోతి: తిరుపతి నగరపాలక సంస్థ సౌర విద్యుత్తుపై ప్రత్యేక దృష్టి సారించింది. శ్రీకాళహస్తి సమీపంలోని కైలాసగిరి రిజర్వాయర్‌లో ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ నుంచి ఇప్పటికే 4 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుండగా, రేణిగుంట సమీపంలోని తూకివాకం వద్ద మరో నాలుగు మెగావాట్ల ప్లాంటు పనులు చకచకా సాగుతున్నాయి. గ్రీన్‌ ఎనర్జీ పద్ధతుల్లో కనీసం 10శాతం విద్యుత్తును ఉత్పత్తిచేయాలని పౌరసంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో స్మార్టు సిటీ నిధులతో సోలార్‌ ప్లాంట్లను నెలకొల్పుతున్నారు. 


తూకివాకం వద్ద 28 ఎకరాల విస్తీర్ణంలో స్మార్ట్‌ సిటీ నిధులతో తిరుపతి కార్పొరేషన్‌ సౌర విద్యుత్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. నోవస్‌ గ్రీన్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.24.5 కోట్లతో 6 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తికోసం అవసరమైన సోలార్‌ ప్యానళ్లను సిద్ధం చేస్తోంది. రోజుకు 24 వేల యూనిట్ల విద్యుత్‌ ఇక్కడ ఉత్పత్తి కానుంది. నవంబరు చివరికల్లా ప్లాంట్‌ పూర్తవుతుందని నోవస్‌ ఎనర్జీ సంస్థ ప్రతినిధి శ్రీధర్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. రానున్న పదేళ్ల వరకు తమసంస్థే మరమ్మతులకు సంబంధించిన సేవలూ అందిస్తుందన్నారు. 


తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలోని కైలాసగిరి రిజర్వాయరు నుంచి తెలుగుగంగ నీటిని పంపింగ్‌ చేయడానికి తిరుపతి నగరపాలక సంస్థ సదరన్‌ డిస్కంకు నెలకు సుమారు రూ.70 లక్షల కరెంటు బిల్లులు చెల్లిస్తోంది. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.12 కోట్లతో కైలాసగిరి రిజర్వాయర్‌లో ఫ్లోటింగ్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. అక్కడ ఉత్పత్తయ్యే 4 మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపుతున్నారు. దీంతో సదరన్‌ డిస్కంకు చెల్లించాల్సిన విద్యుత్‌ బిల్లులు దాదాపుగా తగ్గిపోయాయి. తూకివాకం వద్ద ఆరు మెగావాట్ల సోలార్‌ పవర్‌ మరో నెలలో అందుబాటులోకి వస్తే.. కార్పొరేషన్‌కు విద్యుత్‌ భారం 80 శాతం వరకు తగ్గిపోతుందని అధికారులు భావిస్తున్నారు.                          


సోలార్‌ పవర్‌తో రూ.12కోట్లు ఆదా 

తిరుపతి స్మార్ట్‌ సిటీ  నిధులతో ఇప్పటికే కైలాసగిరిలో 4 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ అందుబాటులోకి వచ్చింది. తూకివాకం వద్ద పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం సదరన్‌ డిస్కంకు ఏటా రూ.15 కోట్ల విద్యుత్తు బిల్లులు చెల్లిస్తున్నాం. ఈ పది మెగావాట్ల సోలార్‌ విద్యుత్తు వల్ల రూ.12 కోట్లు ఆదా కానున్నాయి. 

- పీఎస్‌ గిరీష, తిరుపతి కమిషనరు


Updated Date - 2020-10-14T16:57:50+05:30 IST