వైసీపీలో శిలాఫలకం చిచ్చు
ABN , First Publish Date - 2020-12-29T05:33:49+05:30 IST
సత్యవేడు మండల వైసీపీలో ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా లే అవుట్‌లో ఏర్పాటు చేసిన శిలాఫలకం చిచ్చురేపుతోంది.
సత్యవేడు, డిసెంబరు 28: సత్యవేడు మండల వైసీపీలో శిలాఫలకం చిచ్చురేపుతోంది. ఆదివారం సత్యవేడులో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా లే అవుట్‌లో ఏర్పాటు చేసిన శిలాఫలకంలో పార్టీలోని కొంతమంది పేర్లు లేకపోవడమే ఇందుకు కారణం. స్థానిక బాలికల గురుకుల పాఠశాల సమీపంలో పేదల ఇళ్ల పట్టాల కోసం వేసిన లేఅవుట్‌లో ఏర్పాటు చేసిన శిలాఫలకంలో ప్రొటోకాల్ పాటించలేదు. హౌసింగ్ డీఈ, ఏఈ పేర్లను విస్మరించడంతో పాటు వైసీపీ నాయకులు కొంతమంది ఇష్టారాజ్యంగా తమ పేర్లు వేసుకున్నారు. అధికార పార్టీ నేత ఒకరు ఈ విషయమై నిలదీయడంతో ఎమ్మెల్యే ఆదిమూలం కల్పించుకుని సర్ది చెప్పడంతో వివాదం అప్పటికి ముగిసింది. కాగా, ఈఘటనపై సోమవారం సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అయింది. వైసీపీ సభ్యత్యం లేనివారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి దూరంగా ఉన్న వారు ప్రస్తుతం పెత్తనం చెలాయిస్తున్నారని, కార్యకర్తలు, నాయకులు మేల్కొవాలని ఆ పోస్టు సారాంశం. అంతేకాకుండా ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకులు పార్టీలో ఇతరులను అణగతొక్కుతున్నారంటూ సీనియర్ నాయకుడు ఆవేదన వ్యక్తం చేస్తూ సోషియల్ మీడియాలో పోస్టు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.