వరాహస్వామి ఆలయంలో బాలాలయ సంప్రోక్షణ

ABN , First Publish Date - 2020-12-11T06:48:56+05:30 IST

తిరుమల వరాహస్వామి ఆలయంలో బాలాలయ సంప్రోక్షణ వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు.

వరాహస్వామి ఆలయంలో బాలాలయ సంప్రోక్షణ
మాడవీధుల్లో ఊరేగుతున్న వరాహస్వామి

తిరుమల, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తిరుమల వరాహస్వామి ఆలయంలో గురువారం ఉదయం 9నుంచి 10.30 గంటల మధ్య మకరలగ్నంలో బాలాలయ సంప్రోక్షణ వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, వరాహస్వామి ఉత్సవమూర్తుల ను సుప్రభాతంతో మేల్కొలిపి, పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, ప్రధాన కుంభారాధన, అర్చన నిర్వహించారు. అనంతరం వరాహస్వామి ప్రధాన హోమగుండమైన సభ్యహోమ గుండంలో మహాపూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం బాలాలయంలోని వరాహ స్వామికి ప్రాణప్రతిష్ట నిర్వహించారు.టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి దంపతులు పాల్గొన్నారు.సంప్రోక్షణ సందర్భంగా రాత్రి 8గంటలకు వరాహస్వామిని మాడవీధుల్లో ఊరేగించారు.

ఐదునెలల పాటు వరాహస్వామి దర్శనం రద్దు

 వరాహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారుపూత పూయబడిన రాగిరేకులు అమర్చేందుకు బాలాలయం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. ఈ పనులు పూర్తికావడానికి దాదాపు 5 నెలలు సమయం పడుతుందన్నారు. అప్పటివరకు భక్తులకు వరాహస్వామి మూలమూర్తి దర్శనం ఉండదన్నారు. 

Updated Date - 2020-12-11T06:48:56+05:30 IST