రూ.వెయ్యి కోట్లకు టెండరేస్తున్నారు!

ABN , First Publish Date - 2020-12-06T07:37:11+05:30 IST

వెయ్యి కోట్ల విలువ చేసే తిరుపతి ఆర్టీసీ ప్రాంగణానికి ఎసరు పెడుతున్నారా? తాజా పరిణామాలు మరింత అనుమానాలను పెంచుతున్నాయి.

రూ.వెయ్యి కోట్లకు టెండరేస్తున్నారు!

ప్రైవేటు సంస్థలకు 40 యేళ్ళకు పైగా లీజుకు తిరుపతి ఆర్టీసీ ప్రాంగణం!

ఇప్పటికే రెండుసార్లు పరిశీలించిన ఏపీయూఐఏఎంఎల్‌ బృందం

మార్చి నాటికి స్పష్టమైన ప్రతిపాదనలు సిద్ధమయ్యే అవకాశం


తిరుపతి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే తిరుపతి ఆర్టీసీ ప్రాంగణానికి ఎసరు పెడుతున్నారా? వైసీపీ ప్రభుత్వం ఇందుకు అనువుగా పావులు కదుపుతోందనే అనుమానాలను తాజా పరిణామాలు మరింత పెంచుతున్నాయి. విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, కర్నూలు, తిరుపతి ఆర్టీసీ ప్రాంగణాలను ప్రైవేటు సంస్థలకు సుదీర్ఘ లీజు ప్రాతిపదికన ఇవ్వబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఫైళ్లు బయటకు పొక్కకుండా వేగంగా కదులుతున్నాయంటున్నారు. తిరుపతి ఆర్టీసీ ప్రాంగణాన్ని ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ అనే ప్రభుత్వ రంగ సంస్థ తరపున నిపుణుల బృందం ఇప్పటికే  రెండుసార్లు పరిశీలించింది. వీరు ఏం అంచనాలు సిద్ధం చేస్తున్నారో, ఏమి సలహాలు ఇవ్వబోతున్నారో వెల్లడి కాకపోయినా రాష్టంలో ఆర్టీసీకి అత్యధిక ఆదాయాన్ని అందించే తిరుపతి ప్రాంగణం పరాయిపాలు కాబోతోందనే అనుమానం పలువురిలో వ్యక్తమవుతోంది. 

తిరుపతి నగరంలో అత్యంత కీలకమైన ప్రదేశంలో ఆర్టీసీ ప్రాంగణం ఉంది. 12.83 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంగణంలో శ్రీనివాసం, శ్రీహరి, ఏడుకొండలు, పల్లె వెలుగు పేరిట నాలుగు బస్‌ స్టేషన్లు వున్నాయి. 10.45 ఎకరాల్లో బస్టాండు వుండగా, 2.38 ఎకరాల్లో డిపో గ్యారేజీ వుంది.గరుడ వారధి కోసం 80 సెంట్ల భూమిని  వదులుకోవాల్సి వచ్చింది. ఇదిగాక ప్రైవేటు వ్యక్తులతో వివాదమున్న 80 సెంట్ల భూమి కూడా ఆర్టీసీ స్వాధీనంలోనే వుంది. తిరుపతి ఆర్టీసీ ప్రాంగణానికి పడమర వైపు మినహా మూడు వైపులా ప్రధాన రహదారులు వుండడంతో వాణిజ్యపరమైన విలువ ఈ భూమికి చాలానే ఉంది. మార్కెట్‌ విలువ ప్రకారమే ఈ భూమి విలువ 910 కోట్లకు పైనే చేస్తుంది. వాణిజ్యపరంగా ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఈ భూమి విలువ ఎక్కడికో పోతుంది. ఇంత విలువైన ప్రాంగణాన్ని ప్రైవేటుపరం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు విస్తుగొలుపుతున్నాయి. లీజు పేరిట జరుగుతున్న ఈ వ్యవహారం వెనుక అధికార పెద్దల ప్రయోజనాలు చాలానే ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


రూ.10 కోట్ల వార్షికాదాయం  ఉన్నా ఇంతేనా?

ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచడం అనే పేరుతో విలువైన ప్రాంగణాలను ప్రైవేటు సం స్థలకు అప్పగించాలనేది ప్రభుత్వం ఆలోచన. భవనాలు సహా ప్రైవేటు సంస్థలకు 33 ఏళ్లకు మించి లీజుకు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. బస్సుల నిర్వహణతో సంబంధం లేకుండా కేవలం ప్రాంగణంలోని వాణిజ్య సంస్థల నుంచే ఏడాదికి 10 కోట్ల రూపాయలు ఆర్టీసీకి తిరుపతి నుంచి ఆదాయం వస్తోంది. ఈ ప్రాంగణంలో 178 షాపింగ్‌ గదులున్నాయి. వీటిలో 3 రెస్ట్‌ హౌసులు, 6 హోటళ్ళు, ఒక గోదాము, 5 టాయిలెట్‌ కాంప్లెక్సులు, 3 క్లోక్‌ రూములు ఉన్నాయి. వీటి ద్వారా ప్రస్తుతం ఆర్టీసీకి నెలకు రూ.80లక్షలు లభిస్తోంది.తిరుమలకు వచ్చిపోయే యాత్రికుల తో ప్రాంగణం నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది. కొండపై శ్రీనివాసుడి వైభవం వెలి గేంతకాలం తిరుపతి ఆర్టీసీ ప్రాంగణానికి వచ్చే కష్టం,నష్టం ఏమీ ఉండదు. ఆదాయం పెరగడమే తప్ప నష్టాలకు గురయ్యే అవకాశమే లేదు. మరి ఇటువంటి బంగారం వంటి ప్రాంతాన్ని ప్రైవేటుపరం చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 50 యేళ్లకు లీజుకు ఇస్తారని చెబుతున్నదే నిజమైతే,  సాంకేతికంగా అది లీజే కానీ సర్వాధికారాలూ ప్రైవేటు చేతిలోకి పోతాయి. 50 యేళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఆర్టీసీ గొంతు కోయడ మే అనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇటువంటి ఆలోచనలు మానుకోవాలని తిరుపతిలో మేధావులు సైతం అభ్రిపాయపడుతున్నారు. 


రూ.200 కోట్లతో ప్రతిపాదనలు

తిరుపతి ఆర్టీసీ ప్రాంగణాన్ని ఆంధ్రప్రదేశ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌  తరపున సందర్శించిన నిపుణుల బృందంలో మార్కెటింగ్‌, రవాణా, ఆర్కిటెక్టు నిపుణులున్నారు. ఎంత పెట్టుబడి పెడితే ఎంత ఆదాయం వస్తుంది అనే దిశగా బృందం అధ్యయనం చేస్తోంది. చివరగా గత నెల 22వ తేదీన బృందం వచ్చి ప్రాంగణాన్ని పరిశీలించి, వివరాలు సేకరించి వెళ్ళింది. పబ్లిక్‌-ప్రైవేటు భాగస్వామ్యం కింద సుమారు రూ. 200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి బహుళ అంతస్తులతో నిర్మాణాలు చేపట్టాలని ప్రాధమికంగా నిర్ణయించినట్టు సమాచారం. వచ్చే ఏడాది మార్చి నాటికి మొత్తం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదం పొందాక అదే నెలలో టెండర్లు పిలిచే అవకాశముందని అంటున్నారు. 

Read more