పురపోరులో 136 నామినేషన్ల తిరస్కరణ

ABN , First Publish Date - 2020-03-15T11:46:15+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి శనివారం రిటర్నింగ్‌ అధికారులు నిర్వహించిన పరిశీలనలో 136 నామినేషన్లు తిరస్కరణకు

పురపోరులో 136 నామినేషన్ల తిరస్కరణ

తిరుపతి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి శనివారం రిటర్నింగ్‌ అధికారులు నిర్వహించిన పరిశీలనలో 136 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఎన్నికలు జరుగుతున్న రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 1684 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 136 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. 1548 నామినేషన్లకు ఆమోదముద్ర వేశారు. చిత్తూరులో 537 నామినేషన్లకు గానూ 16, తిరుపతిలో 333 నామినేషన్లలో 9, పుత్తూరులో 235కు గానూ 11, నగరిలో 177 నామినేషన్లలో 20, పలమనేరులో 104కు గానూ 46, పుంగనూరులో 96కు 21, మదనపల్లెలో 202కు 13 వంతున మొత్తం 136 నామినేషన్లను అధికారులు వివిధ కారణాలతో చెల్లవని ప్రకటించారు.


ఈ పరిశీలన సందర్భంగా పుంగనూరులో 31 వార్డులకు గానూ 22 వార్డులు, పలమనేరులో 26 స్థానాలకు గానూ 10 వార్డులు, తిరుపతి నగర కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు గానూ 6 డివిజన్లు, మదనపల్లెలో 35 వార్డులకు గానూ 3 చొప్పున వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా  ఎన్నికయ్యారు. జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న 248 డివిజన్లు, వార్డులకు గానూ 41 స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులకు పోటీ లేకుండా పోయింది.మిగిలిన 207 స్థానాలకు పోటీ నెలకొంది. కాగా చిత్తూరు కార్పొరేషన్‌, నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం కాలేదు.


కాగా తిరుపతిలో 13 డివిజన్లలో టీడీపీకి అభ్యర్థుల్లేకుండా పోయారు. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణకు ఆది, సోమవారాలు గడువున్నందున సోమవారం సాయంత్రానికి ఎన్ని స్థానాల్లో పోటీ వుంటుందనేది స్పష్టం కానుంది. ఆ లోపు వైసీపీకి మరిన్ని స్థానాలు ఉపసంహరణ ద్వారా ఏకగ్రీవమయ్యేందుకు  అవకాశముంది. అదే విధంగా నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో రోజా వ్యతిరేకవర్గం పోటీలో వుంటుందా లేక వెనుకంజ వేస్తుందా  అన్నది కూడా నేడో రేపో తేలిపోనుంది.

Updated Date - 2020-03-15T11:46:15+05:30 IST