మరో వారం ఆగాల్సిందే..!

ABN , First Publish Date - 2020-04-26T10:50:24+05:30 IST

తిరుపతిలోని రెడ్‌జోన్లుగా ప్రకటించిన 11 వార్డులను ఆరంజ్‌, గ్రీన్‌ జోన్లుగా మారాలంటే మరో వారం ఆగాల్సిందేనని ..

మరో వారం ఆగాల్సిందే..!

తిరుపతిలోని 11 వార్డుల్లో రెడ్‌జోన్ల మార్పుపై అధికారులు


తిరుపతి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని రెడ్‌జోన్లుగా ప్రకటించిన 11 వార్డులను ఆరంజ్‌, గ్రీన్‌ జోన్లుగా మారాలంటే మరో వారం ఆగాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. గత నెల చివర్లో టీనగర్‌లో ఢిల్లీ నుంచి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో 32, 35, 36, 37, 38 వార్డులను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. ఆతర్వాత వారం రోజుల్లోనే అదేవీధిలో మరో నాలుగు పాజిటివ్‌లు వచ్చాయి. 36వ డివిజన్లోనే మొత్తం ఐదు కేసులయ్యాయి. వీరిలో మూడ్రోజుల కిందట నలుగురికి రిపోర్టులు నెగటివ్‌ రావడంతో డిశ్చార్జి అయ్యారు.


ఈనెల 11వ తేదీన 44వ వార్డులోని యశోదనగర్‌కు చెందిన మహిళ పాజిటివ్‌ వచ్చింది. దాంతో 44, 41, 42, 43, 33, 34 వార్డులను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. ఈ మహిళకు రిపోర్టు నెగటివ్‌ రావడంతో శనివారం డిశ్చార్జి చేశారు. అంటే.. ఈ వార్డుల్లో నమోదైన ఆరు కేసుల్లో ఐదుగురు డిశ్చార్జి అయ్యారు. వీరిని ఐసొలేషన్‌లో ఉంచి 20 నుంచి 25 రోజులు పూర్తయ్యింది. రెడ్‌జోన్‌ తీసేయాలంటే 28 రోజులుండాలి. అంటే మరో వారంలో ఈ వార్డుల్లో ఎక్కడా కేసులు నమోదు కాకున్నా.. మిగిలిన ఒక కేసు కూడా నెగటివ్‌గా వస్తే రెడ్‌జోన్‌ నుంచి ఆరంజ్‌, గ్రీన్‌ జోన్లుగా ప్రొటోకాల్‌ను బట్టి మారుస్తామంటూ కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారు.  


అనుమతి లేనిదే అన్నదానాలు చేయొద్దు

నగరంలో తమ అనుమతి లేకుండా ఎక్కడా అన్నదానాలు చేయొద్దని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ హరిత స్పష్టం చేశారు. వితరణ చేసేవాళ్ల ఆరోగ్య పరిస్థితులు కూడా అంచనా వేయాల్సి ఉందన్నారు. అందరూ సహకరించాలని కోరారు. 

Updated Date - 2020-04-26T10:50:24+05:30 IST