రెడ్‌జోన్‌ నాలుగు వారాలు

ABN , First Publish Date - 2020-04-14T10:24:36+05:30 IST

శ్రీకాళహస్తిలో సోమవారం మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో

రెడ్‌జోన్‌ నాలుగు వారాలు

శ్రీకాళహస్తిలో  ప్రత్యేక బృందాల ఏర్పాటు.. 

 యుద్ధప్రాతిపదికన పారిశుధ్య చర్యలు 


శ్రీకాళహస్తి/శ్రీకాళహస్తి అర్బన్‌, ఏప్రిల్‌ 13: శ్రీకాళహస్తిలో సోమవారం  మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో  పట్టణంలోని ముత్యాలమ్మగుడివీధి, గోపాలవనం,నగార్చిపాళెం ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు.నగార్చిపాళెంలో ఆంక్షలు మరింత కట్టుదిట్టం చేశారు. అటు కుమారస్వామితిప్ప, పాతబస్టాండు, పీవీరోడ్డు, కొత్తపేట నలువైపులా మార్గాలను మూసివేశారు.నగార్చిపాళెంలో మొత్తం వీధులన్నీ క్రిమిసంహారక మందులతో స్ర్పే చేయడంతో పాటు పెద్దఎత్తున బ్లీచింగ్‌ చల్లారు.


పరిసర ప్రాంతాలవాసులను  ఇతర మార్గాలో రాకపోకలు సాగేంచేలా చూశారు. కలెక్టర్‌ భరత్‌ గుప్తా సోమవారం ఉదయమే శ్రీకాళహస్తికి చేరుకుని మున్సిపల్‌ కార్యాలయంలో అన్నిశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెడ్‌జోన్‌గా ప్రకటించిన ప్రాంతాల్లో ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మరో 28 రోజులపాటు రెడ్‌జోన్‌ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం వెలుగుచూసిన పాజిటివ్‌ కేసులు క్వారంటైన్‌లో ఉన్నవారివే కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.


ప్రస్తుతం రెడ్‌జోన్‌తో పాటు పట్టణంలో మిగిలిన ప్రాంతాల్లోనూ హైపోక్లోరైడ్‌ మిశ్రమాన్ని, ఇతర క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తున్నట్లు చెప్పారు.పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.కమిషనర్‌ శ్రీకాంత్‌, ఏఎస్పీ అనిల్‌ బాబు, డీఎస్పీ నాగేంద్రుడు, సీఐ నాగార్జునరెడ్డి, ఎస్‌ఐ సంజీవకుమార్‌ తదితర అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-14T10:24:36+05:30 IST