పుణ్యక్షేత్రాలకు తగ్గిన భక్తులు

ABN , First Publish Date - 2020-03-18T10:48:12+05:30 IST

నిత్యం భక్తులతో సందడిగా ఉండే పుణ్యక్షేత్రాలపై ‘కరోనా’ ప్రభావం పడింది. భక్తుల రాక గణనీయంగా తగ్గిపోయింది.

పుణ్యక్షేత్రాలకు తగ్గిన భక్తులు

కళ తప్పుతున్న ఉత్సవాలు 

వ్యాపార రంగమూ కుదేలు


తిరుపతి సిటీ, మార్చి 17: నిత్యం భక్తులతో సందడిగా ఉండే పుణ్యక్షేత్రాలపై ‘కరోనా’ ప్రభావం పడింది. భక్తుల రాక గణనీయంగా తగ్గిపోయింది. వీరిపై ఆధారపడిన వ్యాపార రంగమూ అదేస్థాయిలో దెబ్బతింది. ఇక, స్థాని కంగా జరిగే ఉత్సవాలు, జాతర్లపైనా తీవ్రప్రభావం చూపుతోంది. వేసవి కాలం  వచ్చిందంటే ముఖ్యంగా మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, పలమ నేరు,   కుప్పం, చిత్తూరు, తిరుపతితోపాటు పలు ప్రాం తాల్లో గంగ జాతర నిర్వహించడం ఆనవాయితీ. పుంగ నూరులో సుగుటూరు గంగమ్మ జాతర మంగళవారం ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరిగే ఈ జాతరపై కరోనా ప్రభావం పడింది.


గంగజాతరకు బంధువులను ఆహ్వానించవద్దని, అన్నదానాలు ఆపేయాలని అధికారు లు విజ్ఞప్తి చేస్తున్నారు. జాతరకు వచ్చే ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలను పాటించాలని కోరుతున్నారు. జనం ఒకేచోట పెద్ద సంఖ్యలో గుమికూడటం వల్ల వైరస్‌ త్వరగా వ్యాప్తి చెందే ప్రమాదముంది. అందుకని భక్తుల సంఖ్యను తగ్గించడానికి అధికారులు ప్రయత్ని స్తున్నారు. అదేసమయంలో కరోనా భయంతో స్థానికులూ అధికారులకు సహకరిస్తున్నారు. ఇక వాల్మీకిపురంలో జరగనున్న పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాలకూ భక్తులు తగ్గి పోయే అవ కాశాలు మెండుగా ఉన్నాయి. 


వ్యాపారాలకూ కరోనా దెబ్బ

కరోనా వైరస్‌ ప్రభావంతో పుణ్యక్షేత్రాలలో వ్యాపార రంగం కుదేలవుతోంది. ముఖ్యంగా తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే సమయంలో హోటళ్లు, లాడ్జీలతో పాటు పలు దుకాణాల్లో వ్యాపారాలు జరిగేవి. కొన్ని రోజులుగా భక్తుల సంఖ్య తగ్గడంతో వీరి వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. హోటళ్లు, లాడ్జీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు భక్తుల సంఖ్య తగ్గడంతో తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుచానూరు, బోయకొండ తదితర ఆలయాల రాబడి గణనీయంగా తగ్గుతోంది. శ్రీకాళహస్తిలో రాహు-కేతు సర్పదోష నివారణ పూజల సంఖ్య తగ్గడంతో ఆ ఆదాయం తగ్గినట్లే. 

Updated Date - 2020-03-18T10:48:12+05:30 IST