టీటీడీలో సిఫార్సుల కలకలం

ABN , First Publish Date - 2020-12-20T07:04:21+05:30 IST

టీటీడీలో తాత్కాలిక పోస్టుల్లో పనిచేస్తున్న 1031మంది ఉద్యోగులను పర్మినెంట్‌ చేసేందుకు అనుమతి కోరుతూ పాలకమండలి చేసిన తీర్మానం కలకలం రేపుతోంది.

టీటీడీలో సిఫార్సుల కలకలం

1031మంది తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని ప్రభుత్వానికి టీటీడీ సిఫార్సు


తిరుపతి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : టీటీడీలో తాత్కాలిక పోస్టుల్లో పనిచేస్తున్న 1031మంది ఉద్యోగులను పర్మినెంట్‌ చేసేందుకు అనుమతి కోరుతూ పాలకమండలి చేసిన తీర్మానం కలకలం రేపుతోంది.టీటీడీలో 12,655 శాశ్వత పోస్టులున్నాయి.అయితే ప్రస్తుతం పని చేస్తున్నది ఆరువేల పైచిలుకు ఉద్యోగులు మాత్రమే. టీటీడీలో ఇటీవల అతిథి గృహాల నిర్మాణాలు పెరిగాయి. 36ఆలయాలను టీటీడీలో విలీనం చేశారు. ఈ నేపథ్యంలో  డిప్యూటీ ఈవో స్థాయి నుంచి కొత్తగా పోస్టులు క్రియేట్‌ చేసుకుని, వాటిలో ఇప్పటికే పని చేస్తున్న ఉద్యోగులకు ప్రమోషన్‌ ఇచ్చి భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పోస్టులు క్రియేట్‌ చేసుకోవాల్సిన అవసరం  పడినపుడు  ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. 2008నుంచి ప్రభుత్వాన్ని టీటీడీ అనుమతి కోరుతున్నా పోస్టుల సంఖ్యను పెంచలేదు.దీంతో టీటీడీ తన అవసరాలకు తగ్గట్టు తాత్కాలిక పోస్టుల్లోనే తన ఉద్యోగులకు పదోన్నతి ఇచ్చి బాధ్యతలను కట్టబెడుతూ వస్తోంది.ఇలా టీటీడీలో 2145 పోస్టులుండగా,  1031 పోస్టుల్లో ఉద్యోగులు తాత్కాలిక ప్రాతిపదికన పని చేస్తున్నారు. గత నెల 28న జరిగిన పాలకమండలి సమావేశంలో టీటీడీ ఈ అంశాన్ని చర్చించి, 1031 శాశ్వత పోస్టులుగా గుర్తించడానికి ప్రభుత్వ అనుమతి కోరుతూ తీర్మానం చేసింది.ఇప్పటి వరకు తాత్కాలిక పోస్టుల్లో నియమించుకునేందుకు ఈవోకు ఉన్న అధికారాన్ని కూడా వదులుకుంటున్నట్టు తీర్మానంలో పేర్కొంది. టీటీడీ తీర్మానాన్ని ప్రభుత్వం తిరస్కరిస్తే ఇప్పటికే డిప్యూటీ ఈవోలుగా, డిప్యూటీ ఈఈలుగా ప్రమోషన్‌ ప్రాతిపదికన పని చేస్తున్న వారి భవిష్యత్తు అగమ్యగోచరమవుతుంది. వారు ప్రమోషన్‌ వదులుకుని రివర్ట్‌ అవ్వాల్సి ఉంటుంది.అప్పుడు మిగిలిన ఉద్యోగుల ప్రమోషన్లు గందరగోళంలో పడతాయి. ఇందుకు మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. నాలుగు డిప్యూటీ ఈఈ పోస్టుల భర్తీకి డీపీసీ (డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ) మీటింగ్‌ జరిగింది. అయితే ఆ పోస్టులన్నీ తాత్కాలిక పోస్టులు కావడంతో వాటిలో భర్తీ చేయటం కుదరదని డీపీసీ నిర్ణయం తీసుకోవడంతో ప్రమోషన్లు ఆగిపోయాయి. ఒకవేళ ప్రభుత్వం 1031పోస్టుల పర్మినెంటుకు అంగీకరిస్తే భవిష్యత్తులో టీటీడీ తాత్కాలిక పోస్టుల్లో నియమించుకోవడం సాధ్యం కాదు. టీటీడీ ఈవో అధికారాలను రద్దు చేయాలని కోరడం వల్ల ఉన్నతస్థాయిలో పోస్టులు కొత్తగా ఏర్పాటు చేయడం అంత సులభంగా కాదు. దీంతో ప్రమోషన్ల విషయంలో తమకు అవకాశం తగ్గుతుందని టీటీడీ ఉద్యోగులు  భావిస్తున్నారు.

Updated Date - 2020-12-20T07:04:21+05:30 IST