తుఫాన్లను ఎదుర్కోవడానికి సన్నద్ధంకండి

ABN , First Publish Date - 2020-12-01T06:23:25+05:30 IST

ఈ వారంలో రానున్న రెండు తుఫాన్లను ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలని అధికారులకు కలెక్టర్‌ భరత్‌గుప్తా, ఎస్పీ సెంథిల్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

తుఫాన్లను ఎదుర్కోవడానికి సన్నద్ధంకండి
అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ భరత్‌ గుప్తా, ఎస్పీ సెంథిల్‌కుమార్‌

  అధికారులకు కలెక్టర్‌, ఎస్పీ పిలుపు

చిత్తూరు కలెక్టరేట్‌, నవంబరు 30: ఈ వారంలో రానున్న రెండు తుఫాన్లను ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలని అధికారులకు కలెక్టర్‌ భరత్‌గుప్తా, ఎస్పీ సెంథిల్‌కుమార్‌ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాలులో పోలీస్‌, రెవెన్యూ, అగ్నిమాపక, ఇరిగేషన్‌, మున్సిపల్‌ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రమాదకరస్థాయిలో ఉన్న 320 ప్రదేశాల వద్ద పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బందోబస్తుతోపాటు ఇండికేటర్లను పెట్టాలన్నారు. లైఫ్‌ జాకెట్లు, బోట్లు, కట్టర్లు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. చెరువులు, రిజర్వాయర్ల నుంచి నీటి విడుదల చేసే సమయాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. నివర్‌ తుఫాన్‌తో జిల్లాలో ఎనిమిది మంది మృతి చెందారన్నారు. చాలా ప్రాంతాల్లో అన్నిశాఖల అధికారులు, పోలీసులు సమన్వయంతో పనిచేయడం వల్ల 200 మందిని కాపాడగలిగామన్నారు. ట్రైనీ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, డీఆర్వో మురళి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ సురేంద్రరెడ్డి, జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ బాలరాజు, చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ విశ్వనాథ్‌, ఏఎస్పీలు ఈశ్వర్‌రెడ్డి, అరీఫుల్లా, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.


మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా


  బాధితులకు రూ.500 చెల్లింపు షురూ


నివర్‌ తుఫాన్‌ కారణంగా మృతి చెందిన రేణిగుంట మండలం కుమ్మరపల్లెవాసి వి.ప్రసాద్‌, సదుం మండలం కొర్లకుంటపల్లెకు చెందిన రామలక్ష్మమ్మ, పూతలపట్టు మండలం పాలకూరుపల్లెకు చెందిన వినయ్‌రెడ్డి, చంద్రగిరి మండలం పనబాకానికి చెందిన ఆర్‌.రామక్క, పూతలపట్టు మండలం తలపులపల్లెకు చెందిన జి.కిరణ్‌కుమార్‌, పీలేరు మండలం ముంతవారిపల్లెకు చెందిన పి.రామచంద్రారెడ్డి కుటుంబాలకు రూ.5లక్షల వంతున పరిహార చెల్లింపునకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. అలాగే తిరుపతి, చిత్తూరు నగరపాలక సంస్థలు, 24 మండలాల్లో ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లోని 4,012 మంది బాఽధితులకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ప్రత్యేక ఆర్థికసాయాన్ని అందించే ప్రక్రియనూ మొదలుపెట్టారు. 


32 మండలాల్లో వర్షం


32 మండలాల్లో తేలికపాటి వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా.. పీలేరులో 16, బీఎన్‌కండ్రిగలో 13.4, బి.కొత్తకోటలో 9, బంగారుపాళ్యంలో 6.6, సత్యవేడులో 6.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో 6.2 మి.మీకంటే తక్కువ వర్షం కురిసింది. కాగా.. నవంబరు సగటు వర్షపాతం 162.6 మి.మీ కాగా.. రికార్డుస్థాయిలో 290.9 మి.మీగా నమోదైంది. 


Updated Date - 2020-12-01T06:23:25+05:30 IST