ప్రభుత్వ భూమి ఆక్రమణలపై ఆర్డీవో సీరియస్‌

ABN , First Publish Date - 2020-07-28T10:44:41+05:30 IST

మదనపల్లె పట్టణ శివారులో బైపాస్‌రోడ్డు పక్కన సర్వే నెంబరు 5/2లోని ప్రభుత్వ భూమిని చదును చేసి, ప్లాట్లు వేసి ..

ప్రభుత్వ భూమి ఆక్రమణలపై ఆర్డీవో సీరియస్‌

 విక్రయించిన వారు, కొన్నవారిపై క్రిమినల్‌ కేసులు


మదనపల్లె టౌన్‌, జూలై 27: మదనపల్లె పట్టణ శివారులో బైపాస్‌రోడ్డు పక్కన సర్వే నెంబరు 5/2లోని ప్రభుత్వ భూమిని చదును చేసి, ప్లాట్లు వేసి విక్రయించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆర్డీవో మురళి ఆదేశించారు. సోమవారం  వెంకప్పకోట గ్రామపరిధిలోని సర్వే నెంబర్‌ 5/2లో రియల్టర్లు వేసిన తారురోడ్లు, నిర్మించిన పునాదులను ఆర్డీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సర్వేనెంబరులో 3.98 ఎకరాల ప్రభుత్వభూమి వుందని, అందులో 78 సెంట్లు శ్మశానవాటికకు కేటాయించామని తెలిపారు. కొందరు రియల్టర్లు ఈ భూమి పక్కనే వున్న సర్వేనెంబరు 5/3ఏ పట్టాభూమిలో ప్లాట్లు వేయడంతో పాటు, ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించి చదును చేసి ప్లాట్లు వేశారన్నారు. దీంతో తహసీల్దార్‌ సురేష్‌బాబు అక్కడికి వెళ్లి సర్వేచేయించి ప్రభుత్వ భూమి చుట్టూ రాళ్లు నాటినా, రాత్రికి రాత్రే కొందరు రాళ్లు పీకేశారన్నారు.


ఇలా ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారు, కొన్నవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. అంతేకాకుండా సర్వేనెంబరు 5/2లోని ప్రభుత్వ భూమిని పీవోబీ (ప్రొహిబిటరీ ఆర్డర్‌ బుక్‌)లో ఎక్కించేందుకు కలెక్టరుకు ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. అనంతరం బైపాస్‌రోడ్డులోని మున్సిపల్‌ కంపోస్టుయార్డు ఎదుట కొందరు నిర్మాణాలు చేపట్టగా ఈ భూమిని సర్వే చేయించి, ప్రభుత్వభూమిగా నిర్దారణకు వస్తే చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఆర్‌ఐ చాణుక్య, వీఆర్వో శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-28T10:44:41+05:30 IST