వైసీపీ నేత వ్యవసాయ షెడ్‌లో రేషన్‌ బియ్యం డంప్‌ పట్టివేత

ABN , First Publish Date - 2020-12-30T06:17:50+05:30 IST

వైసీపీ గ్రామ నాయకుడికి చెందిన వ్యవసాయ షెడ్‌లో భారీ ఎత్తున నిల్వచేసిన రేషన్‌ బియ్యం డంప్‌ను విజిలెన్సు, రెవెన్యూ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.

వైసీపీ నేత వ్యవసాయ షెడ్‌లో   రేషన్‌ బియ్యం డంప్‌ పట్టివేత
రేషన్‌ బియ్యం డంప్‌ వద్ద వైసీపీ గ్రామ నాయకుడు దేవేంద్ర

 ఆకులవారిపల్లెలో విజిలెన్సు, రెవెన్యూ అధికారుల తనిఖీలు


 346 బస్తాలు స్వాధీనం 


పీలేరు,డిసెంబరు 29: వైసీపీ గ్రామ నాయకుడికి చెందిన వ్యవసాయ షెడ్‌లో భారీ ఎత్తున నిల్వచేసిన రేషన్‌ బియ్యం డంప్‌ను విజిలెన్సు, రెవెన్యూ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం పీలేరు నియోజకవర్గంలో జరిగింది.  తిరుపతి విజిలెన్సు ఎస్పీ ఈశ్వరరెడ్డికి అందిన రహస్య  సమాచారంపై డీఎస్పీ మల్లీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సీఐ టి. అబ్బన్న, ఎస్‌ఐ ఓ. రామస్వామి స్థానిక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అబ్దుల్‌ఖాదర్‌తో కలిసి మంగళవారం సాయంత్రం పీలేరు -మదనపల్లె మార్గంలోని ఆకులవారిపల్లె వ్యవసాయ పొలాల్లో రేషన్‌ బియ్యం డంప్‌పై దాడి చేశారు. ఆకులవారిపల్లెకు చెందిన వైసీపీ నాయకుడు దేవేంద్రకు చెందిన షెడ్‌లోని రెండు గదుల్లో భారీ ఎత్తున నిల్వ చేసిన రేషన్‌ బియ్యాన్ని చూసి అధికారులు నివ్వెరపోయారు. లారీల్లో బియ్యం బస్తాలను ఎక్కించేందుకు ప్రత్యేక నిచ్చెన, డిజిటల్‌ త్రాసులను కూడా ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్న రేషన్‌ బియ్యం అక్రమ దందా బండారం అధికారులను సైతం కలవరపాటుకు గురిచేసింది. పీలేరు మండలంలోని పలు చౌకదుకాణ డీలర్ల నుంచి ఈ రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి డంప్‌లో నిల్వ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యాన్ని అక్రమ మార్గంలో బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు వినవస్తోంది. పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం ‘నల్ల’ దారి పట్టడం విస్మయానికి గురిచేస్తోంది. పట్టుబడ్డ బియ్యం  346 బస్తాలుగా అధికారులు తేల్చారు. ఈ తనిఖీల్లో విజిలెన్సు, రెవెన్యూ అధికారులతో పాటు వీఆర్వో సురే్‌షకుమార్‌రెడ్డి  పాల్గొన్నారు.





Updated Date - 2020-12-30T06:17:50+05:30 IST