ఇంటికే రేషన్‌ పంపిణీ ప్రశ్నార్థకమేనా?

ABN , First Publish Date - 2020-12-19T06:53:13+05:30 IST

‘లబ్ధిదారుడి ఇంటికే రేషన్‌ పంపిణీ చేస్తాం. నాణ్యమైన బియ్యంతోపాటు ఇతర నిత్యావసరాలూ అందజేస్తాం’ అంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

ఇంటికే రేషన్‌ పంపిణీ ప్రశ్నార్థకమేనా?
చిత్తూరు గోదాముకు పాక్షికంగా చేరిన సంచులు

జిల్లాకు మంజూరు కాని సరుకుల కోటా

నమూనా వాహనమూ రాని వైనం 

15.56 లక్షల సంచులు అవసరమైతే

ఇప్పటివరకు వచ్చినవి 50వేలే..!

మిగిలిందిక 13 రోజులే 


చిత్తూరు (సెంట్రల్‌), డిసెంబరు 18: ‘లబ్ధిదారుడి ఇంటికే రేషన్‌ పంపిణీ చేస్తాం. నాణ్యమైన బియ్యంతోపాటు ఇతర నిత్యావసరాలూ అందజేస్తాం’ అంటూ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. పంపిణీ మొదలుపెట్టడానికి ఇక కేవలం 13 రోజుల సమయం మాత్రమే ఉంది. అయినా బియ్యం కార్డుల లెక్క.. ఓ కొలిక్కి రాలేదు. మ్యాపింగూ పూర్తవ్వలేదు. మరోవైపు ఇంటికే రేషన్‌ పంపిణీ ఉండదంటూ వలంటీర్ల వాట్సప్‌ గ్రూపుల్లో ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ సోమయాజులను వివరణ కోరగా, ఇంటింటికీ సరుకుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి గైడ్‌లైన్స్‌ రాలేదన్నారు. నిత్యావసర సరుకుల జిల్లా కోటా అలాట్‌ కాలేదని, పంపిణీకి అవసరమైన వాహనాలు రావాల్సి ఉందన్నారు. బ్యాగులు కూడా పాక్షికంగా చిత్తూరు గోదాముకు చేరినట్లు వివరించారు. ఇదిలా ఉంటే.. పంపిణీ వాహనాల కేటాయింపునకు సంబంధించిన ఫైల్‌ కలెక్టర్‌ ఆమోదానికి నోచుకోలేదు. ఇప్పుడే ఇలా ఉంటే.. భవిష్యత్తులో మరెన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని అధికారుల్లోనూ గుబులు మొదలైంది. 


మంజూరు కానీ కోటా రేషన్‌ 

జిల్లాలోని 11,88,779 రేషన్‌ కార్డులు ఉండగా, వీటిలో 65,293 తొలగించారు, మరో లక్ష కార్డులు మ్యాపింగ్‌లో చూపడం లేదు. ఈ క్రమంలో ఈ నెల జిల్లాలో ఎన్ని కార్డులు ఉన్నాయనే దానిపై ఇప్పటి వరకు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు స్పష్టత రాలేదు. దీంతో నెలా రేషన్‌ కోటా కింద 18వేల టన్నుల బియ్యం, 576 టన్నుల చక్కెర, 10,450 టన్నుల కందిపప్పు సరఫరా చేస్తున్నారు. ఈ నెలలో కార్డుల లెక్క తేలకపోవడంతో ఎంత కోటా రేషన్‌ జిల్లాకు పంపాలన్న దానిపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారుల నుంచి సంస్థ అధికారులకు కోటా సమాచారం అందలేదు. 


వచ్చిన సంచులు 50వేలే..!

జిల్లాకు 15,56,371 బియ్యపు సంచులు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో 10 కిలోల సామర్థ్యం కలిగినవి 11,48,741 బియ్యం సంచులుండగా, 15 కిలోలవి 4,07,630 ఉన్నాయి. వీటిల్లో 10 కిలోల సామర్థ్యమున్న 50వేల సంచులే శుక్రవారం నాటికి చిత్తూరు గోదాముకు చేరాయి. మిగిలిన 15.06 లక్షల సంచులు కూడా త్వరగా పంపాలని సంబంధిత ఏజెన్సీలపై అధికారులు ఒత్తిడి పెంచుతున్నా, ఫలితం నామమాత్రంగా ఉన్నట్లు సమాచారం. 


మొబైల్‌ వాహనాలు ఎప్పుడొస్తాయో..!

రేషన్‌ పంపిణీ చేయడానికి 724 మొబైల్‌ వాహనాలు అవసరమని అధికారులు నిర్ణయించారు. నమూనా వాహనం ఇప్పటివరకు జిల్లాకు రాకపోగా.. వాటిస్థానంలో ఆటోలను సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ, క్రిస్టియన్‌ వర్గాలకు 724 యూనిట్ల (వాహనాల)కు గాను 650 మంది జాబితాను మాత్రమే సంబంధిత అధికారులు ఎంపిక చేసి, ఫైల్‌ను కలెక్టర్‌ ఆమోదానికి పంపారు. కలెక్టర్‌తోపాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి గౌతమ్‌రెడ్డి ఈ ఫైల్‌ను ఆమోదించాల్సి ఉంది. ఇన్ని అవరోధాలను అధిగమించి ఇంటికే రేషన్‌ కార్యక్రమాన్ని అధికారులు ఎలా ముందుకు తీసుకెళతారో వేచి చూడాల్సి ఉంది. 

Read more