-
-
Home » Andhra Pradesh » Chittoor » Rasipuram SI pontificates on minor boy
-
మైనర్ బాలుడిపై ఆర్సీపురం ఎస్‌ఐ ప్రతాపం
ABN , First Publish Date - 2020-03-25T10:57:47+05:30 IST
ఆర్సీ పురం ఎస్.ఐ పరమేశ్వర్‌నాయక్ ఓ మైనర్ బాలుడిపై తన ప్రతాపం చూపించాడు.

హాస్పిటల్‌కు వచ్చివెళ్తుండగా లాఠీతో చితకబాదిన వైనం
ఆయన తీరే అంత అంటున్న స్థానికులు
తిరుపతి(నేరవిభాగం), మార్చి 24: ఆర్సీ పురం ఎస్.ఐ పరమేశ్వర్‌నాయక్ ఓ మైనర్ బాలుడిపై తన ప్రతాపం చూపించాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో జనసంచారాన్ని కట్టడిచేసేందుకుగాను జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రదేశాల్లో మంగళవారం పోలీసులు లాఠీ ఝుళిపించారు. అయితే ఆరోగ్యం బాగలేని ఓ బాలుడినిసైతం వాతలు తేలేలా ఎస్‌ఐ లాఠీతో కొట్టడం తీవ్ర విమర్శలకు గురైంది. ప్రత్యక్షసాక్షులు, బాధితుల కథనం మేరకు...
తన కుమారుడు ముఖేష్ (12)కు ఆరోగ్యం బాగలేకపోవడంతో వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం గ్రామనికి చెందిన మునికృష్ణారెడ్డి (లేట్) భార్య సావిత్రి, తన అక్క కుమారుడు నవీన్‌ను తోడు తీసుకుని మంగళవారం ఉదయం యాక్టివాలో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చింది. వచ్చేమార్గంలో ఆర్సీపురం పోలీసు స్టేషన్‌కు వెళ్లి విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి తాను ఆసుపత్రిలో కుమారుడిని చూపించేందుకు వెళ్తున్నాని చెప్పిమరీ వెళ్లింది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో ఆర్సీపురం వద్దకు చేరుకుంది.
ఆర్సీపురం కూడలిలో ఎస్‌ఐ పరమేశ్వర్‌నాయక్ వారిని ఆపాడు. మాటపలుకు లేకుండా... వారు చెప్తున్నది వినకుండా బండి నడుపుతున్న యువకుడు నవీన్‌ను లాఠీతో కొట్టాడు. అంతటితో ఊరుకోకుండా జ్వరంతో బాధపడుతున్న పన్నెండేళ్ల బాలుడు ముఖేష్‌ను కూడా లాఠీతో వాతలు తేలేలా కొట్టాడు. దీంతో ఆమె ఎస్‌ఐ పరమేశ్వర్‌నాయక్‌ను నిలదీసింది. తప్పు చేసుంటే నన్ను కొట్టండి... కనికరం లేకుండా చిన్నబిడ్డను కొట్టడం ఏంటని ఆమె ఎస్‌ఐ ప్రశ్నిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దృశ్యాలతోపాటు, బాలుడి ఒంటిపై వాతలు చూపుతున్న వీడియోలను ఎవరోతీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
బాలుడిని వాతలుతేలేలా కొట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను విషయం చెప్తున్నా, తన కుమారుడికి చెందిన హాస్పిటల్ ఫైల్ చూపుతున్నా ఎస్‌ఐ ఏమాత్రం పట్టించుకోలేదని, తన అక్క కుమారుడితోపాటు జ్వరంతో ఉన్న తన కుమారుడిని కూడా కొట్టారని సావిత్రి వెల్లడించారు. ఇదిలా ఉండగా... ఎస్‌ఐ పరమేశ్వర్‌నాయక్ సాధారణంగానే ఖఠినంగానే వ్యవహరిస్తారంటూ స్థానికులుకూడా ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.