-
-
Home » Andhra Pradesh » Chittoor » Ramesh Reddy is the cow of the Tirupati Urban District
-
బయట కనిపిస్తే.. ఐసోలేషన్‌కే
ABN , First Publish Date - 2020-03-24T10:53:05+05:30 IST
బయట కనిపిస్తే.. ఐసోలేషన్‌కే

అవసరమైతే జైలుకైనా పంపుతాం
అర్బన్ ఎస్పీ హెచ్చరిక
నేటినుంచి నగరంలో 144 సెక్షన్
తిరుపతి (నేరవిభాగం), మార్చి 23: నగరంలో నిషేధాజ్ఞలు పాటించని వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ ఆవుల రమేష్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం నుంచి ప్రజలెవరైనా అనవసరంగా సంచరిస్తూ రోడ్లపై కనిపిస్తే నేరుగా వారిని క్వారంటైన్ హోమ్‌కు తరలిస్తామని, 14 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంచుతామని చెప్పారు. అవసరమైతే అలాంటి వారిని జైలుకు కూడా పంపుతామని హెచ్చరించారు. జిల్లా లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత, ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని చెప్పిన తరువాత కూడా ప్రజల్లో ఏమాత్రం మార్పు కనిపించలేదన్నారు.
యథేచ్ఛగా నగరంలో తిరుగుతున్నారని, గుంపులు గుంపులుగా ఉంటున్నారని ఇలాంటి పరిస్థితిని ఏమాత్రం సహించేది లేదన్నారు. నగరంలో 144 సెక్షన్‌ను అమలులోకి తీసుకువస్తున్నట్టు చెప్పారు. గుంపులుగా కనిపిస్తే వారిని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఎలాంటి వేడుకలు జరిపేందుకు అనుమతి లేదని, ప్రయాణాలు, విహార యాత్రలు నిషేధిస్తున్నామని పేర్కొన్నారు.
అత్యవసర సేవల ఉద్యోగులకే అనుమతి
కేవలం అత్యవసర సేవల ఉద్యోగులకు మాత్రమే నగరంలో బయటకు వచ్చే అనుమతి ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. వైద్యం, పోలీసు, ఫైర్ శాఖల సిబ్బందికి మాత్రమే అనుమతినిస్తామని, అయితే వారుకూడా విధుల నిమిత్తం మాత్రమే బయటకు రావాలని సూచించారు. మెడికల్ దుకాణాలు 24 గంటలు తెరిచి ఉంటాయని చెప్పారు.