పదోన్నతుల్లో రాయలసీమకు అన్యాయం
ABN , First Publish Date - 2020-06-18T11:07:21+05:30 IST
జలవనరులశాఖ ఇంజనీర్ల పదోన్నతుల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ఆ ఫోరం ప్రధాన కార్యదర్శి మురళీరాజు అన్నారు.
జలవనరులశాఖ ఇంజనీర్ల ఫోరం
తిరుపతి రూరల్, జూన్ 17: జలవనరులశాఖ ఇంజనీర్ల పదోన్నతుల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ఆ ఫోరం ప్రధాన కార్యదర్శి మురళీరాజు అన్నారు. తిరుపతి జలవనరులశాఖ కార్యాలయం వద్ద బుధవారం భోజన విరామ సమయంలో ఇంజనీర్లు భౌతిక దూరం పాటిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా... రాష్ట్రపతి ఉత్తర్వులు అనుసరించకుండా పదోన్నతులకు సీనియారిటీ జాబితాలు తయారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జాబితా ప్రకారం 10నుంచి 15 ఏళ్లు జూనియర్ అయిన జోన్-1 ఇంజనీర్ల కింద రాయలసీమ ఇంజనీర్లు పనిచేయాల్సిన ఉంటుందన్నారు.
మూడేళ్ల తరువాత రాష్ట్రంలోని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, ఆ పైస్థాయి పదవుల్ని జోన్-1 వారితో నింపుతారన్నారు. దీని వల్ల రాయలసీమలో సుమారు 500మంది ఇంజనీర్లు రివర్షన్ అవుతారన్నారు. బ్యాచ్‌వైజ్ సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు చేపట్టాలని ఆయన డిమాండు చేశారు. రాయలసీమ ఇంజనీర్లకు న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఇంజనీర్లు పాల్గొన్నారు.