ఎస్వీయూ వీసీగా రాజారెడ్డి
ABN , First Publish Date - 2020-11-26T06:07:20+05:30 IST
ఎస్వీయూ వీసీగా ప్రొఫెసర్ కె.రాజారెడ్డి నియమితులయ్యారు

నేడు బాధ్యతల స్వీకరణ
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), నవంబరు 25: ఎస్వీయూ వీసీగా ప్రొఫెసర్ కె.రాజారెడ్డి నియమితులయ్యారు. ఆ వర్సిటీలోని సౌత్ ఈస్ట్ ఏషియన్ అండ్ ఫసిఫిక్ స్టడీస్ (సీప్ స్టడీస్) విభాగంలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ పొందిన ఆయన్ను వీసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సన్నిహిత మిత్రుడని సమాచారం. ఎస్వీయూ వీసీగా గురువారం రాజారెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈయన్ను వర్సిటీ పాలకమండలి సభ్యుడు మల్లారపు మధు అభినందించారు.
ప్రొఫెసర్ రాజారెడ్డి నేపథ్యం..
బంగారుపాళ్యం సమీపం కోటూరు గ్రామంలో జన్మించిన రాజారెడ్డి చిత్తూరులో బీఏ చేశారు. ఎస్వీయూలో ఎంఏ హిస్టరీ చదువుకున్నారు. వియత్నాం భాషపై ప్రొఫెసర్ వీఎం రెడ్డి పర్యవేక్షణలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఈ క్రమంలో వియత్నాంలో చాలా కాలం ఉన్నారు. ఫ్రెంచ్, వియత్నాం భాషలపై డిప్లొమాలను పొందారు. తొలుత ఇండో-చైనా విభాగంలో అధ్యాపకుడిగా చేరారు. ఆ తర్వాత సెంటర్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ అండ్ ఫసిఫిక్ స్టడీస్ విభాగ డైరెక్టర్‌గా పని చేశారు. అదే విభాగానికి పాఠ్య ప్రణాళికా సంఘం (బీవోఎస్) చైర్మన్‌గా వ్యవహరించారు. మన దేశ విదేశాంగ విధానం, వియత్నాంపై పరిశోధన చేసారు. వియత్నాంలో జరిగిన అనేక సదస్సుల్లో మన దేశం తరపున ప్రాతినిథ్యం వహించారు.
మూడు ప్రధాన పదవుల్లోనూ వారే!
రాజారెడ్డి నియామకంతో ఎస్వీయూ వీసీ, రెక్టార్, రిజిస్ట్రార్ పదవులను ఒకే సామాజిక వర్గం వారికి కేటాయించినట్లయింది. గతంలో ఎస్సీ, బీసీ, ఓసీ వర్గాలకు మూడు ప్రధాన పదవులను కేటాయించేవారు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎస్వీయూలోని కీలక పదవుల్లో ఒకే సామాజిక వర్గం వారిని నియమిస్తున్ననరు. ఇప్పటికైనా ప్రధాన పదవుల భర్తీలో సామాజిక న్యాయం పాటించాలని యూనివర్సిటీ వర్గాలు కోరుతున్నాయి.