-
-
Home » Andhra Pradesh » Chittoor » qualifications revised for ddlo post in ttd
-
టీటీడీలో డీడీఎల్‌వో నియామకానికి అర్హతల సవరణ
ABN , First Publish Date - 2020-11-25T06:29:40+05:30 IST
డిప్యూటీ దేవస్థానం లా ఆఫీసర్ (డీడీఎల్‌వో) నియామకం కోసం అభ్యర్థుల అర్హతలకు సంబంధించి టీటీడీ ప్రతిపాదించిన సవరణలపై సలహాలు, అభ్యంతరాలు కోరుతూ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది.

అభ్యంతరాలు కోరుతూ ప్రభుత్వం నోటిఫికేషన్
కలికిరి, నవంబరు 24: డిప్యూటీ దేవస్థానం లా ఆఫీసర్ (డీడీఎల్‌వో) నియామకం కోసం అభ్యర్థుల అర్హతలకు సంబంధించి టీటీడీ ప్రతిపాదించిన సవరణలపై సలహాలు, అభ్యంతరాలు కోరుతూ ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. డీడీఎల్‌వో నియామకానికి సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న టీటీడీ ఉద్యోగుల సర్వీసు రూల్స్-1989కి కొన్ని సవరణలను ప్రతిపాదించింది. ఫిబ్రవరి 29న జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపింది. సవరించిన ప్రతిపాదనల మేరకు రెండు విధాలుగా నియమించుకునే అవకాశముంది. పదోన్నతి ద్వారా డీడీఎల్‌వో నియామకానికి టీటీడీలో లా ఆఫీసర్‌గా ఐదేళ్ల సర్వీసు పూర్తయి ఉండాలి. సబార్డినేట్ ఆఫీసర్స్ అకౌంట్ పరీక్షలు పార్ట్-1 ఉత్తీర్ణత సాధించడంతోపాటు పార్ట్-2 కానీ లేదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరీక్షగానీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్ పరీక్షలు పార్ట్-1, 2 పాసై ఉండాలి. టీటీడీలో ఈ అర్హతలున్న వారెవరూ లేనట్లయితే డిప్యుటేషన్‌పై డీడీఎల్‌వోను నియమించుకోవచ్చు. ఈ సందర్భంలో జ్యుడిషియల్ సర్వీసులో ఐదేళ్లు తక్కువ కాకుండా పనిచేసిన సీనియర్ సివిల్ జడ్జినిగానీ, ఏడేళ్లకు తక్కువ కాకుండా సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన వారినిగానీ, ఐదేళ్లు తక్కువ కాకుండా పనిచేసిన హైకోర్టు డిప్యూటీ రిజిస్ట్రారును నియమించుకోవచ్చు. ఈ ప్రతిపాదనలపై ఎవరికైనా అభ్యంతరాలున్నా, సవరణలు చేయాల్సి ఉన్నా 30 రోజుల్లోగా ప్రభుత్వ రెవెన్యూ (దేవదాయ) శాఖ కార్యదర్శికి పంపాలి. లేదంటే గడువు తరువాత తుది ఉత్తర్వులు జారీ చేస్తారు. గతంలోనూ టీటీడీలో లా ఆఫీసర్ నియామకానికి ఇదే విధమైన సవరణలను ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిపై అభ్యంతరాలు లేకపోవడంతో టీటీడీ ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఈ నెల 12న ప్రభుత్వం తుది ఉత్తర్వులు జారీ చేసింది.