745 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

ABN , First Publish Date - 2020-04-07T12:00:35+05:30 IST

ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని వెలుగు, సహకార సంఘాల కొనుగోలు కేంద్రాల

745 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ మంజుభార్గవి 


చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 6: ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని వెలుగు, సహకార సంఘాల కొనుగోలు కేంద్రాల ద్వారా ఇంతవరకు 745 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ మంజుభార్గవి తెలిపారు. సోమవారం తనను కలిసిన మీడియాకు వివరాలు తెలిపారు. కేంద్రాల వారీగా.. కేవీబీపురంలో 119, రేణిగుంటలో 160, శ్రీకాళహస్తిలో 228, తొట్టంబేడులో 178, ఏర్పేడులో 35, బీఎన్‌కండ్రిగలో 20, వరదయ్యపాళెంలో ఐదు మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందన్నారు. తొలి విడతగా పది సహకార పరపతి సంఘాలు, ఆరు వెలుగు సంఘాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలుగా గుర్తించామన్నారు.


చిన్న, సన్నకారు రైతులు పండించిన ధాన్యానికి క్వింటాల్‌కు సాధారణ రకానికి రూ.1,815, గ్రేడ్‌-ఏ రకానికి రూ.1,835 కనీస మద్దతు ధర చెల్లిస్తామని పేర్కొన్నారు. దళారుల చేతిలో రైతులు మోసపోకూడదన్న ఉద్దేశంతోనే ప్రతి గింజనూ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ధాన్యం విక్రయించిన రెండ్రోజుల్లోనే నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని వివరించారు. అవసరాన్నిబట్టి ఈనెల 16వ తేదీనుంచి మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. 

Read more