17న పల్స్‌పోలియో

ABN , First Publish Date - 2020-12-27T06:30:35+05:30 IST

జిల్లావ్యాప్తంగా జనవరి 17వ తేదీన పల్స్‌పోలియో కార్యక్రమం జరుగుతుందని డీఎంహెచ్‌వో పెంచలయ్య తెలిపారు.

17న పల్స్‌పోలియో
సమావేశంలో ప్రసంగిస్తున్న పెంచలయ్య

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కూ సిద్ధం కావాలి: డీఎంహెచ్‌వో


తిరుపతి (వైద్యం), డిసెంబరు 26: జిల్లావ్యాప్తంగా జనవరి 17వ తేదీన పల్స్‌పోలియో కార్యక్రమం జరుగుతుందని డీఎంహెచ్‌వో పెంచలయ్య తెలిపారు. దీనితోపాటు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కూ సిద్ధం కావాలన్నారు. హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ (విజయవాడ) ఆదేశాల మేరకు తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలలోని  ఆడిటోరియంలో శనివారం పల్స్‌ పోలియో కార్యక్రమంపై పీహెచ్‌సీ వైద్యాధికారులతో సమీక్షించారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్టు చెప్పారు. జిల్లాలో 4,93,094 మంది చిన్నారులను గుర్తించడం జరిగిందన్నారు. వీరికోసం 2,984 పోలియో సెంటర్లతోపాటు 98 ట్రాన్సిట్‌, 116 మొబైల్‌ కేంద్రాలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. డీఐవో డాక్టర్‌ హనుమంతరావు మాట్లాడుతూ.. చిన్నారులకు పోలియో చుక్కలు వేయడంతోపాటు అన్ని శాఖల సమన్వయంతో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నామన్నారు. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ హెల్తాఫీసర్‌ డాక్టర్‌ సుధారాణి మాట్లాడుతూ.. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. డాక్టర్‌ శరవణ శ్రీనివాస్‌, జిల్లా వైద్యఆరోగ్యశాఖ గణాంకాధికారి రమేష్‌రెడ్డి, మునిరాజ, డెమోలు నిర్మలమ్మ, శాంతమ్మ, సీహెచ్‌వో జ్ఞానశేఖర్‌, అమరనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-27T06:30:35+05:30 IST