టీడీపీ మండలాధ్యక్షుడి అరెస్టు

ABN , First Publish Date - 2020-03-12T10:58:06+05:30 IST

శ్రీకాళహస్తిలో నామినేషన్ల పక్రియ ప్రశాంతంగా ముగిసిందనుకునే లోపే ఉద్రిక్త వాతావారణానికి తెరతీసింది.

టీడీపీ మండలాధ్యక్షుడి అరెస్టు

 ఇంట్లో మద్యం నిల్వ చేశారంటూ కేసు

ఎక్సైజ్‌ స్టేషన్‌ ఎదుట టీడీపీ ఆందోళన


శ్రీకాళహస్తి, మార్చి 11: శ్రీకాళహస్తిలో నామినేషన్ల పక్రియ ప్రశాంతంగా ముగిసిందనుకునే లోపే ఉద్రిక్త వాతావారణానికి తెరతీసింది. శ్రీకాళహస్తి మండల టీడీపీ అధ్యక్షుడు కామేష్‌యాదవ్‌ను ఎక్సైజ్‌ పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. రామలింగాపురంలోని తన నివాసంలో అక్రమంగా మద్యం సీసాలను నిల్వచేశారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించి అరెస్టు చేసినట్లు ఎక్సైజ్‌ పోలీసులు చెబుతున్నారు. అయితే అధికార పార్టీ ఒత్తిళ్లతో ఎక్సైజ్‌ పోలీసులే మద్యం సీసాలు తీసుకొచ్చి అక్రమంగా కామేష్‌యాదవ్‌ను అరెస్టు చేశారని టీడీపీ నాయకులు ఆరోపించారు. టీడీపీ శ్రేణులు ఎక్సైజ్‌ పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బొజ్జల హరినాఽథరెడ్డి, టీడీపీ నాయకులు చెలికం పాపిరెడ్డి, రెడ్డివారి గురవారెడ్డి తదితరులు ఎక్సైజ్‌ పోలీసులతో వాదనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీఎస్పీ నాగేంద్రుడు ఆందోళనకారులతో చర్చించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో తమ పార్టీ వారిని ఆక్రమంగా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజమని బొజ్జల సుధీర్‌రెడ్డి ప్రశ్నించారు.


తమ నేతను విడుదల చేస్తే కానీ ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పారు.  పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలం నుంచి ఆందోళనకారులను బలవంతంగా పంపించివేశారు. కామేష్‌యాదవ్‌పై అక్రమ మద్యం నిల్వలపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్‌ పోలీసులు రాత్రిపూట న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - 2020-03-12T10:58:06+05:30 IST