శ్రీవారి దర్శనాలు ఆపాల్సిందే
ABN , First Publish Date - 2020-07-19T12:03:35+05:30 IST
కరోనాకు తిరుపతి హాట్ స్పాట్‌గా మారిపోయింది. లాక్‌డౌన్‌కు ముందు.. తర్వాత కొవిడ్ కేసుల పెరుగుదల

లాక్‌డౌన్ సమయంలోలా ఏకాంతసేవలు నిర్వహించాలి
కాదని వదిలేస్తే స్వామి కైంకర్యాలకూ అర్చకులు ఉండరు
తిరుపతి నగరవాసుల భవితగురించి ఆలోచించండి
టీటీడీ బోర్డు మొండివైఖరిపై పలువురి మండిపాటు
తిరుపతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): కరోనాకు తిరుపతి హాట్ స్పాట్‌గా మారిపోయింది. లాక్‌డౌన్‌కు ముందు.. తర్వాత కొవిడ్ కేసుల పెరుగుదల పరిస్థితి చూస్తే స్థానికులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. నెలరోజుల్లోనే 2వేలకుపైగా కేసులు తిరుపతి, తిరుమలలో నమోదవ్వడానికి ప్రధాన కారణం ఇతర ప్రాంతాలనుంచి శ్రీవారి దర్శనం కోసం వస్తున్నవారేనని పలువురు ఆరోపిస్తున్నారు. భక్తుల రాక ఇలాగే కొనసాగితే తిరుపతి మరో వూహాన్ అవుతుందని ఆందోళన చెందుతున్నారు. టీటీడీ ఉద్యోగులతోపాటు అర్చకులకు కూడా వైరస్ సోకుతున్న తీరు చూస్తే శ్రీవారికి నిత్య కైంకర్యాల నిర్వహణ కూడా కష్టమయ్యే పరిస్థితులు రానివ్వకుండా వెంటనే శ్రీవారి దర్శనాలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎవరెవరు ఏమన్నారంటే..
తిరుమల దర్శనాలు ఆపండి
కరోనా బారిన పడుతున్న టీటీడీ సిబ్బంది, అర్చక స్వాములు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తిరుపతి నగర ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు. సంపూర్ణ లాక్‌డౌన్ రోజుల్లో జరిగినట్టుగా ప్రతిరోజు శ్రీవారికి ఏకాంతంగా కైంకర్యాలు నిర్వహించాలి. శ్రీవారి దర్శనాలు నిలిపివేసేలా టీటీడీ పాలకమండలి యుద్ధ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవాలి.
- భానుప్రకాష్‌రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు
తిరుపతిని ఏమి చేయాలనుకుంటున్నారు
తిరుమలకు సుదూర ప్రాంతాల భక్తులను అనుమతించడం వల్లనే తిరుపతితోపాటు టీటీడీ సిబ్బంది కూడా పెద్దసంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. అంతా చూస్తూనే, ఇటు టీటీడీ పాలకమండలి, అటు వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోతున్నాయి. తిరుపతిని ఏమి చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. వెంటనే తిరుమలలో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయాలి. భక్తుల రాకను నిషేధించాలి.
- నరసింహ యాదవ్, టీడీపీ నేత
టీటీడీ అధికారులపై కేసులు ఎందుకు పెట్టకూడదు
కరోనా వైరస్ విస్తరిస్తున్న ప్రారంభ సమయంలో తిరుమల శ్రీవారి దర్శనాన్ని కొద్ది రోజుల పాటు నిలిపివేయాలన్నందుకు నాపై కేసు నమోదు చేశారు. దర్శనాల పునఃప్రారంభం తర్వాత ప్రస్తుతం కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి టీటీడీ అధికారులపై కేసులు ఎందుకు నమోదు చేయకూడదు? టీటీడీ ఈవో, అదనపు ఈవోల తీరుతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోంది. ఆన్‌లైన్‌లో దర్శన టిక్కెట్లు, శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లను అనుమతించాక తిరుపతిలో కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. తిరుమలకు భక్తుల రాకపోకలను నిలిపివేయాలి. అలాగే తిరుపతిలోని ప్రభుత్వ మద్యం దుకాణాలను కూడా 24 గంటల్లోగా మూతవేయాలి.
- నవీన్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నేత
శ్రీవారి కైంకర్యానికీ అర్చకులు కరువయ్యే ప్రమాదం
టీటీడీ సిబ్బందితోపాటు ముఖ్యంగా అర్చకులకూ వైరస్ సోకుతోంది. కొందరిని చికిత్సకోసం చెన్నైకి తరలిస్తున్నారు. ఇలాగే కొనసాగితే శ్రీవారి కైంకర్యాలకు కూడా అర్చకులే కరువయ్యే ప్రమాదం ఉంది. అలాంటి ఉపపద్రవాలు జరగకుండా దర్శనాలు తక్షణం నిలిపివేయాలి. నగర నడిబొడ్డున ఉన్న టీటీడీ యాత్రికుల వసతి సముదాయాలన్నీ కొవిడ్ కేంద్రాలుగా మారిపోయాయి. నగర ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.
- సామంచి శ్రీనివాస్, బీజేపీ నేత
లాక్‌డౌన్‌కు సహకరిస్తాం
లాక్‌డౌన్ సమయంలో తిరుపతిలో పెద్దగా కరోనా కేసులు నమోదుకాలేదు. లాక్‌డౌన్ తీసేసిన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి ద్వారానే కేసుల ఉధృతి పెరిగింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో వ్యాపార సంస్థలు లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నాయి. టీటీడీ కూడా తిరుమలను వ్యాపార దృష్టితో చూడడం మానుకుని దర్శనాలను నిలిపేస్తే మేము కూడా సహకరిస్తాం.
- మంజునాథ్, అధ్యక్షుడు, చాంబర్ ఆఫ్ కామర్స్
భక్తులకు కొవిడ్ పరీక్షలు సరిగా చేయడం లేదు
తిరుమలకు వస్తున్న యాత్రికుల వల్లనే తిరుపతి, తిరుమలలో కేసులు పెరుగుతున్నాయి. దీంతో స్థానికులు వణికిపోతున్నారు. వివిధ ప్రదేశాలనుంచి పెద్దసంఖ్యలో వస్తున్న భక్తులకు ఎలాంటి పరీక్షలు లేకుండా పంపేస్తున్నారు. వేలసంఖ్యల్లో భక్తులు వస్తుంటే పదుల సంఖ్యల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పడం హాస్యాస్పదం. థర్మామీటర్ నెత్తిన పెట్టి పంపేస్తున్నారు. అక్కడ పిచికారీ చేసే క్రిమిసంహారక ద్రావణాల్లో కూడా నీరే ఎక్కువగా ఉంటోంది. తక్షణం తిరుమలకు భక్తులను అనుమతిని రద్దు చేయాలి.
- కిరణ్ రాయల్, జనసేన నేత