-
-
Home » Andhra Pradesh » Chittoor » President in Venkanna service
-
వెంకన్న సేవలో రాష్ట్రపతి
ABN , First Publish Date - 2020-11-25T06:53:52+05:30 IST
నుదుట తిరునామం ధరించి సంప్రదాయ వస్త్రధారణతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

తిరుమల, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి):నుదుట తిరునామం ధరించి సంప్రదాయ వస్త్రధారణతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సతీమణి, కుమార్తెతో పాటు గవర్నర్ బిశ్వభూషణ్‌తో కలిసి మధ్యాహ్నం 12.54 గంటలకు తిరుమలలోని పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం అతిథిగృహంలో తిరునామం ధరించిన రాష్ట్రపతి సంప్రదాయ దుస్తులతో 2.20 గంటలకు శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. క్షేత్రసంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా వరాహస్వామి ఆలయానికి చేరుకున్నారు. పుష్కరిణిలో నీటిని ప్రోక్షణం చేసుకుని భూవరాహస్వామిని దర్శించుకున్నారు.2.45 గంటలకు శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోగా టీటీడీ ఉన్నతాధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.ఆలయంలోకి వెళ్లిన రాష్ట్రపతి కోవింద్ ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత సన్నిధికి చేరుకున్నారు. అక్కడ మూలమూర్తిని దర్శించుకున్నారు. అర్చకులు శ్రీవారి శేషవస్త్రం అందజేశారు. అనంతరం రంగనాయక మండపానికి చేరుకోగా, వేదపండితులు ఆశీర్వచనం చేశారు.తర్వాత శ్రీవారి చిత్రపటాన్ని, 2021 క్యాలెండర్‌ను, డైరీని రాష్ట్రపతికి, గవర్నర్‌కు చైర్మన్, ఈవో అందజేశారు.3.30 గంటలకు ఆలయం నుంచి బయలుదేరి అతిథిగృహానికి చేరుకున్న రాష్ట్రపతి కుటుంబీకులతో కలసి టీటీడీ ఏర్పాటు చేసిన ఊతప్పం, దోసె, పెరుగువడ స్వీకరించారు. సాయంత్రం 5 గంటలకు తిరుమల నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3.30 గంటల దాకా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిని రద్దు చేశారు. మరోవైపు ఎక్కడికక్కడ గేట్లు వేయడంతో ఓ ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లేందుకు భక్తులు రోడ్లపైనే నిరీక్షించాల్సి వచ్చింది.
కలెక్టర్‌కు చేదు అనుభవం?
రాష్ట్రపతి పర్యటనలో కలెక్టర్ భరత్ గుప్తాకు చేదు అనుభవం ఎదురైందనే ప్రచారం జరిగింది. రాష్ట్రపతి ఆలయంలోకి వెళ్లిన కొంత సమయానికి బయోమెట్రిక్ (పుష్కరిణి వైపుగా) నుంచి ఆలయంలోకి ప్రవేశించేందుకు వెళ్లిన కలెక్టర్ వెంటనే సెల్‌ఫోన్ పట్టుకుని తిరిగి రావడంతో ఆలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారనే అనుమానాలు తలెత్తాయి. ఆ తర్వాత కలెక్టర్ అదే మార్గం నుంచి తిరిగి ఆలయంలోకి వెళ్లారు. ఈ అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ విజిలెన్స్ అధికారులను వివరణ కోరగా.. ‘కలెక్టర్ మహాద్వారం నుంచి కాకుండా బయోమెట్రిక్ నుంచి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంతలో తన వెనుకనే వస్తున్న ఇంటెలిజెన్స్ ఎస్పీ, తిరుపతి ఏఎస్పీ, డీఎస్పీ, ఆర్‌ఐ బయోమెట్రిక్ వద్దనే ఆగిపోయారు. గుర్తించిన కలెక్టర్ తిరిగి వెనక్కి వెళ్లి వారిని ఎందుకు ఆపారని ప్రశ్నించారు. తమకు ఇచ్చిన లిస్ట్‌లో వారి పేర్లు లేవని విధుల్లోని సిబ్బంది బదులిచ్చారు. ఇంతలోనే కలెక్టర్‌కు ఫోన్ రావడంతో మాట్లాడుతూ బయోమెట్రిక్ నుంచి వెలుపలకు వచ్చారు. కొంత సమయం తర్వాత కలెక్టర్‌తో పాటు విజిలెన్స్ అధికారులు మిగిలిన వారిని కూడా ఆలయంలోకి అనుమతించారు’ అని విజిలెన్స్ అధికారులు వివరించారు. కాగా తనకెలాంటి అవమానం జరగలేదని,బయోమెట్రిక్ ప్రవేశద్వారం గుండా ఆలయంలోకి వెళ్లానని కలెక్టర్ కూడా ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు.అయితే రాష్ట్రపతి వెంట శ్రీవారి ఆలయంలోకి వెళుతున్న కలెక్టర్‌ను టీటీడీ విజిలెన్స్ అధికారులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని జిల్లా రెవెన్యూ సంఘం నాయకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే టీటీడీకి సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించారు.
అమ్మవారి సేవలో రాష్ట్రపతి
తిరుచానూరు, నవంబరు 24: తిరుచానూరులోని శ్రీవారి దేవేరి పద్మావతీ దేవిని మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దర్శించుకున్నారు. ఆయన వెంట గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తదితరులున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జేఈవో బసంత్‌కుమార్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వదించారు. లడ్డు ప్రసాదాలతో పాటు అమ్మవారి శేషవస్త్రాన్ని రాష్ట్రపతి దంపతులకు అందజేశారు.ఉదయం 11.30 నుంచి 12 గంటల వరకు అమ్మవారి ఆలయంలో రాష్ట్రపతి ఉన్నారు.రాష్ట్రపతి రాక సందర్భంగా తిరుచానూరులో ఆయన ప్రయాణించే మార్గాన్ని ఉదయం 9 గంటల నుంచి దిగ్బంధం చేశారు. ఎక్కడికక్కడ మాడవీధుల గేట్లకు తాళాలు వేశారు.

గంట ముందుగానే ట్రాఫిక్ నిలిపేసిన పోలీసులు
ఎటూవెళ్లే మార్గంలేక ఉసూరుమన్న ప్రజలు
తిరుపతి(నేరవిభాగం), నవంబరు 24: రాష్ట్రపతి రాక సందర్భంగా తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.రాష్ట్రపతి ప్రయాణించే మార్గంలో విమానాశ్రయంనుంచి తిరుపతి ఉప్పరపల్లె కూడలి వరకు, అక్కడినుంచి అలిపిరి మీదుగా తిరుమల వరకు అడుగడుగునా భద్రతా సిబ్బందిని మోహరించడంతో పాటు ఆ మార్గంలో దుకాణాలన్నింటినీ మూసేశారు.రాష్ట్రపతి రావడానికి గంట ముందునుంచే పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపేశారు. దీంతో నాయుడుపేట వైపు, అలాగే రేణిగుంట బైపాస్ కూడలి, కడప మార్గం, గాజులమండ్యం కూడళ్లలో కిలోమీటర్ల పొడవున వాహనాలు బారులు తీరాయి. హైవేలోనే కాకుండా నగరంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తిరుచానూరు సింధు సర్కిల్, తనపల్లెక్రాస్, మల్లవరంక్రాస్, ఉప్పరపల్లె కూడలి, తుమ్మలగుంట రోడ్డు, వైకుంఠపురం కూడళ్లలో వాహనాలు పెద్దసంఖ్యలో నిలిచిపోయాయి. ఇక మహిళా వర్శిటీ నుంచి పద్మావతిపురం, ఎస్వీ నగర్, బాలాజీకాలనీ, టౌన్‌క్లబ్ మీదుగా అలిపిరి వరకు ట్రాఫిక్‌ను నిలిపేయడంతో చిన్నపాటి వీధుల్లో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ వీధుల్లో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.
