ఎన్నికల వాయిదాతో ఖర్చు తడిసి మోపెడే..

ABN , First Publish Date - 2020-03-19T11:06:49+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అభ్యర్థులకు కొత్త సమస్యను తెచ్చి పెట్టించి. ఆరు వారాల పాటు తమ అనుచరులను, పార్టీ కార్యకర్తలను పోషించడం కష్టమవుతోందని కొంతమందిస్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అభ్యర్థులకు కొత్త సమస్యను తెచ్చి పెట్టించి.

ఎన్నికల వాయిదాతో ఖర్చు తడిసి మోపెడే..

స్థానిక అభ్యర్థుల మల్లగుల్లాలు

30 జడ్పీటీసీ, 425 ఎంపీటీసీ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం

మిగిలిన అభ్యర్థులకు తప్పని తిప్పలు


చిత్తూరు, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అభ్యర్థులకు కొత్త సమస్యను తెచ్చి పెట్టించి. ఆరు వారాల పాటు తమ అనుచరులను, పార్టీ కార్యకర్తలను పోషించడం కష్టమవుతోందని కొంతమందిస్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అభ్యర్థులకు కొత్త సమస్యను తెచ్చి పెట్టించి. ఆరు వారాల పాటు తమ అనుచరులను, పార్టీ కార్యకర్తలను పోషించడం కష్టమవుతోందని కొంతమంది అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా అధికార వైసీపీలో అత్యధికులు పలు రకాల పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల తంతు ముగిసేవరకు తమ బృందం ఖర్చులను భరించే బాధ్యత అభ్యర్థుల మీదే ఉంటుంది. దీంతో పాటు ఓటర్లనూ కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ వీరికి సమస్యలను తెచ్చి పెడుతున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా స్థానిక ఎన్నికలు ఆరు వారాల పాటు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. మొత్తం జిల్లాలో 65 జడ్పీటీసీ, 858 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో ఇప్పటికే 30 జడ్పీటీసీ, 425 ఎంపీటీసీ స్థానాలు వైసీపీకి ఏకగ్రీవమయ్యాయి.


ఇక మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అకస్మాత్తుగా వాయిదా పడ్డాయి. వారం రోజుల్లో ఎన్నికలు ముగిస్తే ప్రచార ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అభ్యర్థులంతా అంచనా వేసుకున్నారు. ఇంతలోనే ఎన్నికల సంఘం నిర్ణయం మార్చడంతో వారంతా విలవిలలాడుతున్నారు. వాస్తవానికి ప్రాదేశిక ఎన్నికల ప్రచార సమయం తక్కువగా ఉండడంతో నామినేషన్ల ఉపసంహరణ అనంతరమే ప్రచారం మొదలుపెట్టారు. కొంతమంది ముందే రంగంలోకి దిగి ఒక విడత గ్రామాలను చుట్టేసి ప్రచారం చేశారు. ఎన్నికలు వాయిదా పడడంతో ఇప్పుడంతా ఖర్చులపై ఆందోళన చెందుతున్నారు. ఆరు వారాల పాటు ఓటర్లు, అనుచరగణం చేజారకుండా ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందోనని కలవరపడుతున్నారు. ప్రత్యర్థులు బలం పుంజుకోకుండా ఎన్ని తిప్పలు పడాలోనని భయపడుతున్నారు.


సర్పంచు స్థానాలూ ఏకగ్రీవమయ్యేలా పన్నాగం..?

జిల్లాలో మొత్తం 1410 గ్రామ పంచాయతీలు ఉండగా.. వీటిలో పదింటికి కోర్టు స్టే ఉండడంతో ఎన్నికలకు దూరమయ్యాయి. మిగిలిన పంచాయతీల సర్పంచ్‌ పదవులకు రిజర్వేషన్లు ఖరారు అయిపోయాయి. వాస్తవానికి ఎన్నికలు వాయిదా పడకుంటే ఈ 17 నుంచి మొదటి విడత, 19 నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవ్వాలి. ఎన్నికలు వాయిదా పడడంతో సర్పంచ్‌ పదవులు ఆశించేవారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం కన్పిస్తోంది.


ఇప్పటికే అధికార పార్టీ నేతలు అనేక అరాచకాలు సృష్టించి జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్ల స్థానాలను ఏకగ్రీవం అయ్యేలా చేసుకున్నారు. గత చరిత్రలో ఎన్నడూలేని విధంగా అధికారులు సైతం వైసీపీ నేతలకు దాసోహం అయ్యారని వైసీపీయేతర పార్టీలు విమర్శిస్తున్నాయి. పెద్ద ఎత్తున టీడీపీ అభ్యర్థులతో పాటు ఇతరుల నామినేషన్లను తిరస్కరించి వైసీపీ అభ్యర్థులకు ఆయా స్థానాలు ఏకగ్రీవమయ్యేలా చేశారని దుయ్యబడుతున్నాయి. ఎన్నికలు వాయిదా పడకుంటే సర్పంచు స్థానాలనూ పెద్ద మొత్తంలో ఏకగ్రీవం చేసుకుని ఉండేవారని వైసీపీయేతర పార్టీలు ఆరోపిస్తున్నాయి.

Updated Date - 2020-03-19T11:06:49+05:30 IST