డిప్యూటీ సీఎం అంజాద్‌బాషాకు పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-07-14T11:03:12+05:30 IST

వైరస్‌ సోకి తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాష హఠాత్తుగా కుటుంబం..

డిప్యూటీ సీఎం అంజాద్‌బాషాకు పాజిటివ్‌

స్విమ్స్‌ నుంచి డిశ్చార్జి

హఠాత్తుగా హైదరాబాద్‌కు పయనం

వైద్యం పట్ల అసంతృప్తితో అని ప్రచారం


తిరుపతి, జూలై13(ఆంధ్రజ్యోతి): వైరస్‌ సోకి తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరిన ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాష హఠాత్తుగా కుటుంబం సహా హైదరాబాద్‌కు వెళ్ళిపోవడం చర్చగా మారింది. కడపజిల్లాలో విస్తృతంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఆయన వైరస్‌ బారినపడ్డారంటూ కొంతకాలంగా ప్రచారం జరిగింది. దాని పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం ప్రకటించారుకూడా. జూలై6న ట్రూనాట్‌ పరీక్షలో నెగటివ్‌ వచ్చిందంటూ ఆయనకు వచ్చిన మెసేజ్‌ సోషల్‌ మీడియాలో అనుచరులు ప్రచారం కూడా చేశారు. 7,8 తేదీల్లో కడపజిల్లాకు ముఖ్యమంత్రి వచ్చినపుడు కూడా అంజాద్‌బాషా ఆయన వెంట ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. అయితే ఆయనతో పాటూ  కుటుంబీకులు మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కడపలో చికిత్స తీసుకున్నారు. ఆ సందర్భంగా ఆయనకు గతంలోనే కార్డియో థొరాసిక్‌ సర్జరీ జరిగినందున కరోనా నేపధ్యంలో ఏదైనా సమస్య తలెత్తుతుందేమోనన్న అనుమానాలు కడప ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి వైద్యులు వ్యక్తం చేశారు. అదే సమయంలో అక్కడ తీసిన సీటీ స్కాన్‌లో న్యుమోనియా వున్నట్టు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ రెండు సమస్యలు తలెత్తే అవకాశాలున్నందున మెరుగైన చికిత్స కోసం తిరుపతి పద్మావతీ ఆస్పత్రికి వెళ్ళాల్సిందిగా కడప ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రెఫర్‌ చేయడంతో శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో అంజాద్‌ బాషా, ఆయన భార్య, కుమార్తె స్విమ్స్‌ పద్మావతీ ఆస్పత్రికి చేరుకున్నారు.


వీరికి ఇక్కడ ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. శనివారం అంతా ఆసుపత్రిలోనే ఉన్న వీరు ఆదివారం సాయంత్రం హఠాత్తుగా డిశ్చార్జి అయి వెళ్లిపోయారు. స్విమ్స్‌లో వైద్య సేవలు సరిగా లేవనే అసంతృప్తితోనే వెళ్లిపోయారని దీనిపై ప్రచారం జరిగింది. ఇలా ఉండగా స్విమ్స్‌లో  వారిని పరీక్షించిన వైద్యులు కరోనా పాజిటివ్‌ అయినప్పటికీ లక్షణాలేమీ లేవని నిర్ధారించారు.  కాగా, కార్డియో థొరాసిక్‌ సర్జన్లు, రేడియాలజీ విభాగం వైద్యులు ఇరువురూ పరీక్షించి అటు గుండె సంబంధిత, ఇటు న్యుమోనియాకు సంబంధించిన సమస్యలేమీ లేవని స్పష్టం చేయడంతో తాము హైదరాబాదు వెళతామని, అక్కడైతే తమకు సౌకర్యంగా వుంటుందని జిల్లా కలెక్టర్‌కు సమాచారమిచ్చి ఆదివారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో స్విమ్స్‌ నుంచీ  హైదరాబాదు బయల్దేరి వెళ్ళినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే శుక్రవారం రాత్రి చేరినప్పటి నుంచీ ఆదివారం రాత్రి డిశ్చార్జి అయ్యే వరకూ ఈ సమాచారాన్ని అత్యంత గోప్యంగా వుంచారు. డిప్యూటీ సీఎం వెళ్ళిపోయాక గానీ ఈ సమాచారం బయటకు రాలేదు. పైగా ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ఆసుపత్రులకు గాక ఆయన తెలంగాణా రాజధానికి వెళ్ళడం చర్చగా మారింది. ఏపీలోని వైద్యం పట్ల ఉపముఖ్యమంత్రికే నమ్మకం లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. Updated Date - 2020-07-14T11:03:12+05:30 IST