ఆ కిరాతకుడు దొరికాడు.. మరదలికి నిప్పటించిన కేసులో అరెస్టు

ABN , First Publish Date - 2020-12-19T05:37:29+05:30 IST

రెండో పెళ్లి చేసుకోలేదని ములకలచెరువు మండలం గట్టుకిందపల్లెకు చెందిన సుమతికి నిప్పంటించిన బావ వెంకటేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఆ కిరాతకుడు దొరికాడు.. మరదలికి నిప్పటించిన కేసులో అరెస్టు
వెంకటేష్‌ అరెస్టు చూపుతున్న డీఎస్పీ రవిమనోహరాచారి, పక్కనే సీఐ తదితరులు

పెళ్లి చేసుకోలేదని మరదలికి నిప్పటించిన కేసులో అరెస్టు 


 ములకలచెరువు, డిసెంబరు 18: మరదలిని రెండో పెళ్లి చేసుకోవాలని బావ ఆశపడ్డాడు. ఆ కోరిక తీరక పోవడంతో ఆమెపై పెట్రోల్‌ పోసి ఆ కిరాతకుడు హత్యాయత్నం చేసి పరారయ్యాడు. ఎట్టకేలకు నిందితుడిని ములకలచెరువు పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, సీఐ సురేష్‌కుమార్‌ వెల్లడించారు. పోలీసుల కథనం మేరకు.. ములకలచెరువు మండలం సోంపల్లె పంచాయతీ గట్టుకిందపల్లెకు చెందిన కదిరి శివన్న, నరసమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలున్నారు. వీరిలో తొమ్మిదేళ్ల కిందట రెండవ కుమార్తె మాధవిని కర్నాటక రాష్ట్రం హొస్కోట సమీపంలోని బేగూరుకు చెందిన వెంకటేష్‌(34)కు ఇచ్చి వివాహం చేశారు.


కాగా, ఆయన అత్తగారింట్లో మూడేళ్లపాటు ఇల్లరికం ఉన్నారు. ఈ నేపథ్యంలో భార్య ఆరోగ్యం బాగోలేక పోవడంతో మరదలు సుమతి(24)ని ఇచ్చి పెళ్ళి చేయాలంటూ అత్తమామలపై వెంకటేష్‌ ఒత్తిడి తెస్తున్నాడు. వారు ససేమిరా అనడంతో ఆరునెలల కిందట బేగూరు వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో సుమతికి ఓ యువకుడితో ఈనెల 25న వివాహం చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న వెంకటేష్‌ మరొకరికి తన మరదలు దక్కకూడదని భావించాడు. దీంతో ఆమెను చంపాలని నిర్ణయించుకుని, ఈనెల 17వతేది తెల్లవారుజామున గట్టుకిందపల్లెకు వచ్చాడు. అనంతరం ఇంటి వరండాలో నిద్రిస్తున్న సుమతిపై పెట్రోలు పోసి నిప్పంటించి పరారయ్యాడు. ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో ఉక్కిరిబిక్కిరైన యువతి పరుగులు తీస్తూ ఇంటిపక్కనే ఉన్న నీటితొట్టెలో దూకి ప్రాణాపాయం నుంచి బయటపడింది. గ్రామంలో కుక్కలు అరిస్తే ప్రమాదమని గుర్తించిన వెంకటేష్‌ విషం కలిపిన అన్నం పెట్టాడు. ఆ అన్నం తిని మూడు కుక్కలు, ఒక పిల్లి, 30 కోళ్ళు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం ములకలచెరువు సమీపంలోని తంబళ్ళపల్లె క్రాస్‌ వద్ద ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 


గట్టుకిందపల్లెలో పర్యటించిన డీఎస్పీ 

డీఎస్పీ రవిమనోహరాచారి శుక్రవారం సాయంత్రం గట్టుకిందపల్లెలో పర్యటించారు. యువతిపై హత్యాయత్నం జరిగిన సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. సుమతి తల్లి నరసమ్మ, గ్రామస్తులను విచారించి పలు వివరాలను సేకరించారు. ప్రమాదంలో గాయపడిన యువతి కొద్దిగా కోలుకున్నట్లు సుమతి కుటుంబీకులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. యువతిపై హత్యాయత్నానికి పాల్పడిన వెంకటేష్‌కు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవిమనోహరాచారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకుని రెండు రోజుల్లో కేసును చేధించారన్నారు. కాగా, నిందితుడి అరెస్టులో కీలకపాత్ర వహించిన సీఐ సురేష్‌కుమార్‌, ఎస్‌ఐ రామకృష్ణకు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ప్రత్యేకంగా ఫోన్‌ చేసి అభినందించారు. 

Updated Date - 2020-12-19T05:37:29+05:30 IST