40 శాతం వైకల్యంతో కుటుంబంలో రెండో పింఛనుకు వెసులుబాటు

ABN , First Publish Date - 2020-02-12T10:59:29+05:30 IST

కనీసం 40 శాతం వైకల్యంతో వికలాంగుల వర్గీకరణలో పింఛను పొందుతున్న దివ్యాంగుల కుటుంబంలో రెండో పింఛనుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

40 శాతం వైకల్యంతో కుటుంబంలో రెండో పింఛనుకు వెసులుబాటు

కలికిరి, ఫిబ్రవరి 11: కనీసం 40 శాతం వైకల్యంతో వికలాంగుల వర్గీకరణలో పింఛను పొందుతున్న దివ్యాంగుల కుటుంబంలో రెండో పింఛనుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. గతంలో 80 శాతం వైకల్యం వుంటేగానీ కుటుంబంలో రెండవ పింఛను పొందడానికి అర్హత లేదంటూ 80 శాతం లోగా వైకల్యం వున్న వారి పింఛన్లన్నీ తొలగించారు. దీంతో 75 శాతం వైకల్యం వున్నా గానీ ఆ కుటుంబంలో రెండో పింఛనుకు అర్హత లేదంటూ అనేక పింఛన్లు తొలగించారు.


కొన్ని చోట్ల ఏకంగా రెండో పింఛను అలాగే వుంచి వికలాంగుల పింఛన్లను తొలగించారు.ఉదాహరణకు కలికిరి మండలంలోని మహల్‌ పంచాయతీకి చెందిన పాతికేళ్ళ షేక్‌ షబ్బీర్‌ హుస్సేన్‌ పింఛను ఈ కారణంగానే రద్దయిపోయింది. ఈయనకు 75 శాతం వైకల్యం కారణంగా పదేళ్ళ నుంచి ప్రతి నెలా వికలాంగుల పింఛను క్రమం తప్పకుండా వస్తోంది. కుటుంబంలో రెండవ పింఛను వుందన్న కారణంగా షబ్బీర్‌ పింఛను ఫిబ్రవరిలో తొలగించారు. ఒకే కుటుంబంలోని అతని తల్లి రహ్మత్‌ బీకి కేవలం నెలకు రూ. 500 వంతున డ్వాక్రా ద్వారా అభయహస్తం పింఛను వస్తోంది. కనీసం 80 శాతం వైకల్యం వుంటేగానీ ఆ కుటుంబంలో రెండో పింఛనుకు అర్హత లేదన్న కారణంగా ఇతని పింఛను రద్దయ్యింది. దీని పైన ఈ నెల 2వ తేదీన ఆంధ్రజ్యోతి కథనం ప్రచురితమైంది. ఈ ఒక్క కారణంగా జిల్లాలో దాదాపు వెయ్యికి పైబడి పింఛన్లు రద్దయ్యాయి.


75 శాతం వున్నా 80 శాతం వైకల్యం వున్నా రూ. 3 వేలు పింఛను మాత్రమే అందుతుంది. పింఛను విలువ రూ. 3 వేలే అయినప్పుడు 75-80 శాతం మధ్య వివక్ష ఎందుకని దీని హేతుబద్దతపై విమర్శలు రావడంతో ప్రస్తుతం ఈ నిబంధనను పూర్తిగా సడలించారు. అంటే ఇక మీదట 40 శాతం మాత్రమే వైకల్యం వున్నా అతనికి పింఛను మంజూరు కావడంతోపాటు అదే కుటుంబంలో ఇతర అర్హతలపై ఇంకో పింఛను పొందేందుకు కూడా వెసులుబాటు లభించింది. ఈ మేరకు ఎంపీడీవోలకు మార్గదర్శకాలు అందాయి. ఈ వెసులుబాటు కారణంగా షబ్బీర్‌కు మళ్ళీ పింఛను మంజూరు కానుంది. 

Updated Date - 2020-02-12T10:59:29+05:30 IST