రెండువేల మందికి పెన్షన్ డౌటే!
ABN , First Publish Date - 2020-07-27T11:30:40+05:30 IST
జిల్లాలోని రెండు వేల మందికి పైగా విశ్రాంత ఉద్యోగులకు ఆగస్టు 1న పింఛను అందని పరిస్థితి నెలకొంది

చిత్తూరు కలెక్టరేట్, జూలై 26: జిల్లాలోని రెండు వేల మందికి పైగా విశ్రాంత ఉద్యోగులకు ఆగస్టు 1న పింఛను అందని పరిస్థితి నెలకొంది.జనవరిలో లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించక పోవడమే ఇందుకు కారణం. జిల్లావ్యాప్తంగా 18 సబ్‌ట్రెజరీ కార్యాలయాల పరిధిలో 29520 మంది విశ్రాంత ఉద్యోగులున్నారు. వీరందరూ ఏటా నవంబర్‌లో లైఫ్ సర్టిఫికెట్లను సమర్పిస్తుంటారు. ఈ ఏడాది జనవరి ఒకటోతేదీ నుంచే వీటిని అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గత నవంబరులోనే వీటిని ఇచ్చామని భావించి అధికశాతం పెన్షనర్లు ఈ విషయం పట్టించుకోలేదు. అప్పట్లో అందిన సర్టిఫికెట్ల వివరాలను సబ్‌ట్రెజరీ కార్యాలయ అధికారులు(ఎస్టీవో) ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు పెన్షనర్లకు సజావుగానే పింఛన్లు అందాయి.
ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికెట్లు నమోదయిన వారికి మాత్రమే పింఛన్లు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో గత ఏడాది నవంబరులో లైఫ్ సర్టిఫికెట్లు ఇచ్చి, జనవరిలో సమర్పించని జిల్లాలోని 2500మంది పింఛనుదారులకు ఆగస్టు ఒకటోతేదీ పింఛను అందని పరిస్థితి ఏర్పడింది.ఈ విషయం రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఖజానా శాఖ డీడీ గంగాద్రి తెలిపారు. ఈనెలాఖరులోగా పింఛనుదారులు సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో లైఫ్ సర్టిఫికెట్లను సమర్పిస్తే ఇబ్బందులు ఉండవన్నారు. సీఎ్‌ఫఎం్‌స.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లోని ఎంప్లాయీస్ సెల్ఫ్ సర్వీ్‌సలో లాగిన్ అయి యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ కాలమ్‌లో వివరాలు నమోదు చేయవచ్చని సూచించారు.