నిలకడగా శ్రీవారి ఆలయ పెద్ద జీయంగార్ ఆరోగ్యం
ABN , First Publish Date - 2020-07-18T19:57:03+05:30 IST
తిరుమల ఆలయ పెద్ద జీయంగార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.

తిరుమల : తిరుమల ఆలయ పెద్ద జీయంగార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. చాతుర్మాస దీక్షలో ఉన్న జీయంగార్ కోరిక మేరకు వైద్య సేవలు అందించాలని వైద్యులను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. ఇవాళ సాయంత్రం లోపు ఆయన్ను తిరుపతిలోని మఠానికి తరలించే అవకాశం ఉంది.
కాగా.. మొదట ఆయన్ను చికిత్స నిమిత్తం చెన్నై అపోలోకు తరలించాలని టీటీడీ అధికారులు భావించారు. అయితే ఆయన వైద్యం విషయంలో పెద్ద ట్విస్ట్ ఒకటి వెలుగు చూసింది. ఈ నెల 5వ తేదీన పెద్ద జీయర్.. చాతుర్మాస దీక్ష తీసుకున్నారు. జీయర్ దీక్షలో ఉన్న సమయంలో పొలిమేరలు దాటకూడదని నిబంధన ఉంది. ఆరోగ్య రీత్యా ఈ ఉదయం పద్మావతి కోవిడ్ సెంటర్‌కు టీటీడీ అధికారులు తరలించారు. సాయంత్రంలోపు జీయర్‌ను పెద్ద జీయర్ మఠానికి తరలించి.. మఠంలోనే వైద్యం అందించే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. కాగా జీయర్‌కు స్వయంగా సేవలు అందించేందుకు శిష్య బృందం ముందుకొచ్చింది.